చండీయాగం. తెలంగాణలో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కేసీఆరే. బీఆర్‌ఎస్ అధినేతకు సెంటిమెంట్లు ఎక్కువ. ఇప్పటికే పలుమార్లు చండీయాగం నిర్వహించి.. యాగాలకు పెట్టిన పేరుగా నిలిచారు సీఎం కేసీఆర్. ఇటీవల కాలంలోను బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ బాటలో చండీయాగాలను నిర్వహించారు. ఆయన యాగాలు, ముహూర్తాలు, నమ్మకాలను తప్పుపట్టినవాళ్లు కూడా ఉన్నారు.
విచిత్రంగా ఇప్పుడు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూడా చండీయాగం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సొంతూరు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి చండీయాగం చర్చనీయాంశమైంది. తెలంగాణలో మొన్నటిదాకా కొట్లాటలు, కుమ్ములాటలతో కాలం వెళ్లదీసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వస్తుందేమో అన్నంతగా స్పీడ్ పెంచింది. ఇదే సమయంలో రేవంత్‌రెడ్డి చండీయాగం తనకోసమా.. పార్టీకోసమా అన్నదే అసలు పాయింట్. పార్టీ అధికారంలోకొచ్చి తాను ముఖ్యమంత్రిని కావాలన్న కోరిక నెరవేరాలనే ఆయన ఈ యాగాన్ని నిర్వహించినట్లుంది.
ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి.. హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతకు, భీతిపోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీయాగం చేస్తారు. అధికారంలోకి రావడానికే యాగం చేశానని రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఎక్కడా చెప్పకపోయినా.. తెలంగాణకు త్వరలోనే మంచి రోజులు రావాలన్నదే తన ఆకాంక్షంటున్నారు. అన్నీపార్టీలు ఇలాంటి యాగాలు చేయడం కేసీఆర్‌కి కూడా మంచిదే. ఎందుకంటే ఆయన విశ్వాసాల్ని తప్పుపట్టే అవకాశం ఉండదు.