హ్యాట్రిక్ టార్గెట్‌తో దూసుకుపోయిన కారు.. గమ్యానికి చేరకముందే బ్రేక్‌డౌన్ అయింది. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అనుకున్న అధికారపార్టీ అంచనా తప్పింది. రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలతో అధికారపీఠానికి దూరమైంది బీఆర్‌ఎస్. అభివృద్ధిలో రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా నిలబెట్టామని చెప్పినా, పదేళ్లలో జరిగిన అభివృద్ధిని పదేపదే ప్రస్తావించినా తెలంగాణ ప్రజలు మార్పుకోరుకున్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, దళితబంధులాంటి పథకాలు బీఆర్‌ఎస్‌ని గట్టెక్కించలేదు. విజయాలకంటే వైఫల్యాలు, సమస్యలే ప్రజలకు పెద్దవిగా కనిపించాయి. ఉద్యమపార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నిలిచి కొట్లాడిన పార్టీగా రెండుసార్లు అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలు.. మూడోసారి మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ తమ దరిదాపుల్లోకి కూడా రాదనుకుంది బీఆర్‌ఎస్. బీజేపీని సింగిల్ డిజిట్ పార్టీగానే చూసింది. మరోసారి అధికారంలోకి వచ్చేది తామేనన్న ధీమాతోనే చివరిదాకా ఉంది. అయితే అహంభావం, మితిమీరిన ఆత్మవిశ్వాసం కేసీఆర్‌ని దెబ్బతీశాయి. రాష్ట్ర బాగోగులను విస్మరించి జాతీయపార్టీగా బలపడాలన్న ప్రయత్నం చేయడం. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది.
బీఆర్‌ఎస్ అధికారంలోకొచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారు. తెలంగాణ గడ్డ మీద తాము తప్ప ఇతరులు ఉండకూడదనే తీరుతో బీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. రెండోసారి గెలిపించాక రాష్ట్ర ప్రగతిపై దృష్టిపెట్టాల్సిన ప్రభుత్వం.. రాజకీయాలకే పెద్దపీట వేసిందన్న అభిప్రాయం బలపడింది. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గాలు తమ సామంతరాజ్యాలు అనుకున్నారు. పార్టీ ఫిరాయిస్తారనో, వాళ్లమీద వ్యతిరేకత ఉన్నా తనను చూసి ఓటేస్తారన్న ధీమాతోనో 90శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చారు కేసీఆర్. వారిమీదున్న వ్యతిరేకత పార్టీ గెలుపు అవకాశాలకు గండికొట్టింది.
ప్రజల పోరాటాలతో వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తించింది. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ అన్న స్లోగన్ హస్తంపార్టీ ప్రచారంలో భాగమైపోయింది. అటు బీఆర్‌ఎస్ ప్రచారమంతా కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. డిక్లరేషన్లు, ఆరుగ్యారంటీలకు తోడు అన్ని వర్గాలను ఆకట్టుకునే మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రచారం పాజిటివ్‌గా ముందుకెళ్లింది. బీఆర్‌ఎస్ ప్రచారమంతా నెగిటివ్ క్యాంపెయిన్‌లా సాగింది.
కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని బీఆర్‌ఎస్ భయపెట్టినా, దశాబ్దాలనాటి ఇందిరమ్మరాజ్యం గురించి ప్రస్తావించినా ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే రాష్ట్రం నష్టపోతుందని చెప్పేందుకు కర్నాటక నుంచి రైతులొచ్చి ప్రచారం చేసినా అది అధికారపార్టీ డ్రామాగానే ప్రజలు భావించారు. కాంగ్రెస్‌కి అధికారమిస్తే ఏడాదికో సీఎం మారతారని బీఆర్‌ఎస్ ప్రచారంచేసినా అయినా ఫర్లేదన్నట్లే చేతిగుర్తుకు ఓట్లు గుద్దేశారు తెలంగాణ ప్రజలు.
ఉద్యోగ నియామకాలు, పేపర్ల లీకేజీలు బీఆర్‌ఎస్ ఓటమికి మరో బలమైన కారణం. యువతరం ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా గొంతెత్తింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతో సాధించిన తెలంగాణలో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని యువత భావించింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగటంతో కేసీఆర్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. అన్నిటికీ మించి టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారి తన పేరులోనే తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోవడం, అధికారంలోకి వచ్చాక ఉద్యమకారుల త్యాగాలను విస్మరించటంతో ఎన్నో వర్గాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి సమయం కోసం ఎదురుచూసి గట్టి సమాధానం చెప్పింది. నిరంకుశ వైఖరితో పాటు బీఆర్‌ఎస్ పాలనలో ఎవరికీ ప్రశ్నించే స్వేచ్ఛలేకుండా పోయిందని ప్రజలు భావించారు.
బీఆర్‌ఎస్-బీజేపీ రెండూ ఒకటేనన్న ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మారు. దానికి తగ్గట్లే కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన బీఆర్‌ఎస్… బీజేపీని మాత్రం పెద్దగా టార్గెట్ చేసుకోలేదు. అటు బీజేపీ కూడా అంతే. దీంతో లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని నిజమని నమ్మని ప్రజలు ఆ రెండుపార్టీలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.