బీజేపీ ఏపీలో బలపడాలనుకుంటోంది. మొన్నటిదాకా జనసేన మద్దతును నమ్ముకుంది. కానీ పవన్‌కళ్యాణ్ టీడీపీకి దగ్గర కావటంతో వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి చేతికి పగ్గాలిచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబుకు గురిపెట్టింది. టీడీపీని దెబ్బతీస్తే ఆ స్థానంలో తాను ఎదగొచ్చన్నది కమలం పార్టీ మాస్టర్‌ప్లాన్. నమ్మశక్యంగా లేకపోయినా నిజం ఇదేనంటున్నారు రఘువీరారెడ్డిలాంటి తలపండిన సీనియర్.
రఘువీరారెడ్డి ఆషామాషీ నాయకుడేం కాదు. పీసీసీ మాజీ ప్రెసిడెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు. అలాంటి నాయకుడు చంద్రబాబు అరెస్ట్‌పై కీలక కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం భుజాలపై తుపాకి పెట్టి బీజేపీ తెరవెనుక చక్రం తిప్పుతోందని రఘువీరారెడ్డి అనుమానిస్తున్నారు. బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని బలహీనపర్చడం ద్వారా బీజేపీ ఎదగాలనుకుంటోందన్నది రఘువీరా సూత్రీకరణ. బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమలుచేసిందని రఘువీరా చెబుతున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలియకుండా చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశమే లేదంటున్నారు రఘువీరారెడ్డి. హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఆశీస్సులతోనే ఏపీలో పరిణామాలు జరుగుతున్నాయన్నది రఘువీరా డౌట్. తెరవెనుక ఎవరున్నారు, ఎవరు చక్రం తిప్పుతున్నారన్నదానికంటే ఇది చంద్రబాబు స్వయంకృతమన్న వాదనని ఎవరూ కొట్టిపారేయలేరు. అభియోగాలకు బలమైన ఆధారాలు ఉన్నాయికాబట్టే బెయిల్ కూడా రాలేదన్నది టెక్నికల్ పాయింట్. దీన్ని బీజేపీలాంటి పార్టీ రాజకీయంగా బలపడేందుకు వాడుకోవడంలో ఆశ్చర్యమేముంది.