ఏ రాజకీయమైనా ఎన్నికలదాకే ఉండాలి. తర్వాత ద్వేషాలు, భేషజాల వల్ల లాభమేమీ ఉండదు. ఆ విషయం తెలిసినా రాజకీయపార్టీలు తమ సహజప్రవృత్తిని వదులుకోలేవు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తప్పులను కూడా ఒప్పేనని దబాయిస్తారు. ప్రతిపక్షంలోకి రాగానే తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరన్నట్లే వ్యవహరిస్తారు. కాస్త మొరటుగా ఉండొచ్చుగానీ గురివిందగింజల్లా మారిపోతారు. కశ్మీర్‌నుంచి కన్యాకుమారిదాకా ఇదే రాజకీయాన్ని చూసిచూసీ అలవాటుపడిపోయారు ప్రజలు కూడా.
తెలంగాణలో మొన్నటిదాకా కేసీఆర్ సామ్రాజ్యమే నడిచింది. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. కాంగ్రెస్‌కి అంత సీన్ లేదనుకున్నారు. బీజేపీ దరిదాపుల్లోకి కూడా రాదనుకున్నారు. కానీ ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా అందలమెక్కించగలరు. ఎవరినైనా పాతాళానికి తొక్కేయగలరు. కేసీఆర్‌ని పదేళ్లు నెత్తినపెట్టుకున్న ప్రజలే గద్దెదించారు. కాంగ్రెస్‌మీద అపారమైన నమ్మకమేమీ లేకపోయినా దాన్నే ప్రత్యామ్నాయంగా భావించారు.
రేవంత్‌రెడ్డి దూకుడు అందరికీ తెలుసు. గ్రౌండ్‌లెవల్‌నుంచీ ఎదిగిన నాయకుడు. ఆయన ముఖ్యమంత్రికాగానే ఇంకేముందీ వేధింపుల పర్వం మొదలవుతుందనుకున్నారు. బీఆర్ఎస్ నేతల పనైపోతుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మెచ్యూర్డ్‌గా ముందుకెళ్తున్నారు తెలంగాణ కొత్త సీఎం. ఎన్నికలప్రచారంలో తాము దుమ్మెత్తిపోసిన మాజీ సీఎం కాలుజారి ఆస్పత్రిలో ఉంటే రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించడం ఎవరి ఊహకీ అందని విషయం. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్పత్రిలో చేరితే ఆ పార్టీ నేతలకంటే ముందే కేసీఆర్ కూతురు కవిత వెళ్లి పరామర్శించడం మంచి పరిణామం.
పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్‌తో పాటు ఎంఐఎం, బీజేపీ నేతలపై రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ సీఎం అయ్యాక విమర్శలు, వివాదాలను పక్కనపెట్టారు. వరుస సమీక్షలతో బిజీగా ఉంటూనే కాంగ్రెస్ నేతలను, ప్రతిపక్ష నేతలను కలుపుకొని వెళ్తున్నారు. కేసీఆర్‌ని పరామర్శించి ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆరాతీశారు. ఇక ఎంఐఎంతో కాంగ్రెస్ సఖ్యత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. కానీ ఎన్నికలు ముగిశాక సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌కి పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కనిపించారు అక్బరుద్దీన్.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. పరస్పరం సహకారంతో ముందుకు సాగుదామని చెప్పారు. కేంద్ర పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్‌రెడ్డిని కోరారు. పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఎన్ని విమర్శలు చేసుకున్నా.. అభివృద్ధి విషయంలో రేవంత్‌రెడ్డి అందరినీ కలుపుకొని వెళ్లడం శుభపరిణామం. కానీ సరిచేయాల్సిన లెక్కలెన్నో ఉన్నాయి. తవ్వి తీయాల్సిన అంశాలెన్నో మిగిలే ఉన్నాయి. ఎవరినీ నొప్పించకుండా పాలనసాగించడం అసాధ్యం. ఇప్పటికైతే ఆల్ ఈజ్ వెల్. భవిష్యత్తు దృశ్యమెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.