యూట్యూబ్‌ ఛానెళ్లు పెడితే గెలిచేవారా!

kalvakuntla-family.jpg

కేసీఆర్‌ కుటుంబం కాళ్లు ఇంకా నేలకు దిగలేదు. కల్వకుంట్ల కుటుంబం ఇంకా కాల్పనిక ప్రపంచంలోనే బతుకుతున్నట్టుంది. ప్రాణాలు ఫణంగా పెట్టి (తరచూ అధినేత చెప్పుకునే మాటే) కేసీఆర్‌ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరం ఎలా జరిగినట్లు? ప్రజలంతా కూడబలుక్కుని ఇంత తప్పిదం ఎందుకు చేసినట్లు? తమకోసం సర్వస్వం త్యాగంచేసిన పార్టీని ఎందుకు ఓడించినట్లు? పార్టీ శ్రేణులో, వీరాభిమానులో ఇలా ఆలోచించారంటే అర్ధముంది. కానీ ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు కేసీఆర్‌ కుటుంబం. కేసీఆర్‌ ఓటమిపై ఇంకా నోరుమెదపలేదుగానీ ఆయన వారసులిద్దరూ ఇంకా కాంగ్రెస్‌ గెలుపు ఓ చారిత్రక తప్పిదంలానే భావిస్తున్నారు. ప్రజలు పొరపాటు చేశారన్నట్లే మాట్లాడుతున్నారు.

ఉద్యమంకోసం కొట్లాడిన పార్టీ ఎలా ఉండాలి. ప్రజల్లో ఉండాలి. వారి కంచంలోని ముద్దని అడిగి పెట్టుచుకునేంత ఆత్మీయంగా మెలగాలి. గద్దెనెక్కినప్పటినుంచీ ఏనాడైనా కేసీఆర్‌ కుటుంబం సామాన్యులకు అందుబాటులో ఉందా? వారి గుండెచప్పుడుని చెవులు రెక్కించి వినే ప్రయత్నం చేసిందా? ఇది కదా ఓటమి తర్వాత చేసుకోవాల్సిన ఆత్మవిమర్శ. సాదాసీదాగా పనిచేసుకుపోతున్న కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూస్తే, ఎమ్మెల్యే అయ్యాక కూడా తన మూలాలు మరిచిపోకుండా మట్టి నేలపైనే చతికిలపడి శ్రమజీవులతో కలిసి అన్నంతింటున్న ఖానాపూర్‌ గిరిజనబిడ్డను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నాయకులు ఇలా కూడా ఉంటారా అన్న చర్చకు తన రాచరికపోకడతో అవకాశమిచ్చింది కేసీఆర్‌ కుటుంబం కాదా!?

నెలరోజులు గడిచిపోయినా ఓటమిని కేసీఆర్‌ కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వాస్తవాల్ని చూడలేకపోతోంది. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో మనస్సాక్షిని ప్రశ్నించుకోలేకపోతోంది. కేటీఆర్‌ తాజా కామెంట్స్‌ చూస్తుంటే ప్రజలు తప్పుడు మాటలు విని తమను ఓడించారని భావిస్తున్నట్లే ఉంది. 32మెడికల్‌ కాలేజీల బదులు 32 యూట్యూబ్‌ ఛానెళ్లు పెట్టి ఉంటే తప్పుడు ప్రచారాన్ని సులువుగా ఎదుర్కునేవారట. తను సొంతంగా ఆ మాట అనకపోయినా ఓ నెటిజన్‌ అభిప్రాయంతో కేసీఆర్‌ తనయుడు ఏకీభవించారు. దాన్నే ట్వీట్‌ చేశారంటేనే ఆయన కూడా అదే అభిప్రాయంతో ఉన్నారన్నమాటే. పాటలనో, యూట్యూబ్‌ మాటలనో నమ్మేసి ఓట్లేశారంటే ప్రజల్ని కేటీఆర్‌ గొర్రెల మందలా భావిస్తున్నట్లుంది.

ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ప్రతిపక్షాన్ని బలహీనపరిచి తెలంగాణలో తమ మాటే వేదం అనుకుంది కేసీఆర్‌ పార్టీ. ఇనుపకంచెల మాటున బతుకుతూ సామాన్యుడి గొంతు వినలేకపోయింది. ఎక్కడికి వెళ్లినా రాజు వెడలె.. అన్నట్లే సాగేది అధినేత పర్యటన. అయినా కేసీఆర్‌ ప్రచారం చేసుకోలేకపోవడానికి ఏముంది? చెప్పుకోడానికి అసలేముందని? ఆ బంధు ఈ బంధు అని డప్పా కొట్టుకోవడమే తప్ప తెలంగాణ రూపురేఖలు మార్చడానికి పదేళ్లలో చిత్తశుద్ధితో చేసిందేముందని? సాగునీరు తెచ్చామన్న ప్రచారాన్ని కాళేశ్వరం ముంచేసింది. సంపన్నరాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నిరుద్యోగుల జీవితాలు త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారాలు పనిచేశాయనుకుంటే సింగరేణిలో ఆ పార్టీ కార్మిక సంఘం ఉనికే లేకుండా పోయింది. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తమ పాలనలో లోపాలున్నాయని కేసీఆర్‌ కుటుంబం గ్రహించాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అలాంటి తీర్పే రావాలేమో!?

Share this post

submit to reddit
scroll to top