గత ప్రభుత్వ వైఫల్యాలను కళ్లకు కట్టేందుకు కాంగ్రెస్ సర్కారు శ్వేత పత్రం. తొమ్మిదిన్నరేళ్లలో ఎంత చెమటోడ్చామో చాటుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం స్వేద పత్రం. తలకుమించి ఇచ్చిన హామీలకు బడ్జెట్ ఎలా సర్దుబాటు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న. అంత గొప్ప పాలన అందిస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారన్న ఆత్మవిమర్శ చేసుకోలేని కేసీఆర్ పార్టీ.. కాంగ్రెస్‌ని అప్పుడే ప్రజల్లో దోషిగా నిలబెట్టాలనుకుంటోంది.
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల కుప్పగా మార్చేసిందని అసెంబ్లీలో శ్వేతపత్రంతో అధికారపక్షం విరుచుకు పడింది . అయితే అవన్నీ తప్పుడు లెక్కలంటూ ప్రతిపక్షం కౌంటర్ ఇచ్చింది. అదే క్రమంలో తన పాలనలోని ప్రగతిని స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ప్రజల ముందు పెడుతోంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవటంతో తెలంగాణ భవన్‌లో తన పాలనలో ఏమేం చేశామో కేసీఆర్ పార్టీ ఏకరువు పెట్టింది. ఆ పార్టీ ఎన్నికల ప్రచారమంతా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను, ఇందిరమ్మ పాలనలోని అరాచకాలను చెప్పడానికే పరిమితమైంది. ఈ స్వేదమేదో ప్రచారంలో చిందించి ఉంటే ప్రజలు పునరాలోచించే అవకాశం ఏదన్నా ఉండేదేమో!
నాలుగు లక్షల కోట్లలోపే అప్పులు తెచ్చామని, దానిని 50లక్షల కోట్ల పెట్టుబడిగా మలచామన్నది బీఆర్ఎస్ వాదన. మరి ఆ అభివృద్ధి దేవతావస్త్రంలా ఎవరికీ కనిపించకపోవడమే విషాదం. రెక్కల కష్టంతో చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత పెంచామంటోంది బీఆర్ఎస్. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించేది లేదంటోంది. కానీ ధనికరాష్ట్రం అప్పులెందుకు చేయాల్సి వచ్చిందో, మిగులు బడ్జెట్ ఖాళీ ఖజానాని ఎందుకు మిగిల్చిందో నిరక్ష్యరాస్యులకు కూడా అర్ధమయ్యేలా చెప్పి ఉండాల్సింది. కేసీఆర్‌కి ఉంటానికి సొంతిల్లు లేదు, తిరగడానికి సొంత కారులేదన్న మాట ఎంత అసంబద్ధంగా ఉంటుందో, సంపదని సృష్టించామని బీఆర్ఎస్ చెప్పడం కూడా అంతే కామెడీగా ఉంటుంది. విద్య, వైద్యరంగాల్లో జాతీయ గణాంకాల్లో తెలంగాణ స్థానం దారుణంగా ఉంది. ప్రపంచంలోనే అద్భుతమని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సాక్షిగా కుంగిపోయింది.
శాసనసభలో తమగొంతు నొక్కే ప్రయత్నం చేశారంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వివాదాలు వద్దనుకుంటోంది కాబట్టే అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావు గొంతులు అంత బలంగా లేచాయి. పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ చెబుతున్నట్లు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం సాగించి ఉంటే.. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరు దశాబ్దాల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసాన్ని పదేళ్లలోపు సరిచేసి ఉంటే.. ప్రగతిభవన్ గేట్లు సామాన్యులకోసం ఏనాడూ ఎందుకు తెరుచుకోలేదో చెప్పాలి. ఉద్యమసమయంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులతో తమను అస్థిరపరిచే ప్రయత్నాలతో ఆనాడు బాధపడి ఉంటే.. అదేదారిలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా స్వేదపత్రం సాక్షిగా నిజాయితీగా చెప్పుండాల్సింది. అహంకారంతో పదేళ్లు విర్రవీగి, ప్రజలు గద్దెదించాక ఇప్పుడు ఎంత స్వేదం చిందించినా లాభం ఉండదేమో!