అప్పుడు ఇప్పుడు విభజన సమస్యలే అజెండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు- తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి భేటీ కాగా.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్ సమావేశమయ్యారు. ఈసారి చంద్రబాబు- రేవంత్‌రెడ్డి కలిసి కూర్చున్నారు. మూడుసార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచిపోయింది. కానీ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. దాంతో అప్పటినుంచీ తెలుగు రాష్ట్రాల సీఎంలమధ్య సమావేశాలు జరుగుతున్నాయేగానీ సమస్యలకో పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
2014- 2019 మధ్య అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అప్పటి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలిపారు. 2015 జూన్ 23న హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఈ భేటీ జరిగింది. అప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నిప్పులు రాజేస్తున్న నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో చంద్రబాబు, కేసీఆర్‌ని కలిపి చర్చలు సాగేలా చేశారు నరసింహన్. 2019 ఎన్నికల్లో గెలిచాక, తన ప్రమాణ స్వీకారానికి అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఆ తర్వాత 2019 మేనెలలో జగన్ దంపతులు హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పుడే ఆ ఇద్దరి మధ్య మొదటిసారి విభజన సమస్యలపై చర్చ జరిగింది. 2019 జూన్ 26న హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లినప్పుడు ఇద్దరి మధ్య విభజన సమస్యలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్‌ని కలిశారు అప్పటి ఏపీ సీఎం జగన్. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, నీటి పంపకాలపై చర్చించారు. 2020 జనవరి 13న కూడా హైదరాబాద్‌లో కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లినప్పుడు.. నీటి పంపకాలు, గోదావరి జలాల తరలింపుపై ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి.
మళ్లీ నాలుగేళ్లకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్ వేదికగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. సుమారు రెండు గంటల పాటు విభజన అంశాలతో పాటు.. పదేళ్లుగా తేలకుండా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉన్నతస్థాయి కమిటీ భేటీ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకుంటే.. మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. విభజన సమస్యలే అజెండాగా పదేళ్లుగా ఇన్ని భేటీలు జరిగినా పరిష్కారం దొరక్కపోవడం విశేషం. మరి కమిటీలతో సమస్యల పరిష్కారంలో ముందడుగు పడుతుందో లేదో చూడాలి.