రాజకీయం బ్రదర్‌.. అన్నీ వదిలేయడమే!

muslims.jpg

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరిన వేళ పార్టీలు బట్టలు విప్పేశాయి. దాచడానికేం లేదు. దాచుకోడానికేం లేదు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావో తేల్చుకోవాల్సిందే. ముస్లిం వర్గాల విషయంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రాజుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది కాషాయపార్టీ. తాము అధికారంలోకి రాకపోతే ముస్లింల అజాన్ కూడా వినపడకుండా చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. హిందువుల ఓట్లే లక్ష్యంగా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి బీసీలకు ఇస్తామని బీజేపీ ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టడం చర్చనీయాంశమైంది. బీజేపీ, కాంగ్రెస్ ముస్లిం వర్గాలను ఎప్పుడు పట్టించుకోలేదన్నది బీఆర్‌ఎస్‌ వాదన. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాకపోతే ముస్లిం మసీదుల్లోంచి వినిపించే ఆజాన్ కూడా వినిపించకుండా పోతుందంటూ బీఆర్‌ఎస్ అధినేత తనయుడు, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ బీజేపీకి Bటీమేనన్న ప్రచారం తెరపైకొచ్చింది. దీంతో పదేళ్లుగా తమకు మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్లు చేజారతాయన్న ఆందోళన గులాబీపార్టీలో ఉంది. ఇదే సమయంలో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేస్తామనటాన్ని బీఆర్‌ఎస్‌ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తానంటున్న బీజేపీ ఆ వర్గానికి తాము వ్యతిరేకం కాదని చెబుతోంది. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే తాము వ్యతిరేకమని చెబుతోంది. దేశంలో ఎక్కడా ముస్లింలకు మతతత్వ రిజర్వేషన్లు లేవన్నది బీజేపీ వాదన. తెలంగాణలో ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను తాము అధికారంలోకి వస్తే ఎత్తివేసి వెనుకబడిన ఓబీసీ వర్గాలకు ఆ రిజర్వేషన్లను పంచుతామంటూ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడమే కాదు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పారు.

ఓవైపు ఎంఐఎం తాము పోటీ చేయని చోట రాష్ట్రంలో బీఆర్ఎస్ కే తమ మద్దతని ప్రకటించింది. అయిన ముస్లింల ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బీఆర్‌ఎస్ ఇతర పార్టీలను ముస్లింలు నమ్మొద్దంటున్నారు. వేరే పార్టీలు అధికారంలోకొస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రచారంలో గులాబీపార్టీ నేతలు ఊదరగొడుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న ప్రకటనతో ఇతర వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది

Share this post

submit to reddit
scroll to top