తప్పు చేస్తున్నావ్ కేజ్రీవాల్ అని ముందే హెచ్చరించాడా గురువు. కానీ గురువుని మించిన శిష్యుడు వింటేగా.. చివరికి పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఈడీ అరెస్టు చేయగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదికి మళ్లింది. తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు లిక్కర్‌కు దూరంగా ఉండాలని పదే పదే చెప్పేవాడినని, కానీ అరవింద్ కేజ్రీవాల్ చివరికి అదే మద్యం పాలసీ కేసులో అరెస్టయ్యాడని అన్నాహజారే వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ మద్యం పాలసీ రూపొందించినప్పుడు రెండేళ్లక్రితమే దానిపై లేఖరాశారు అన్నాహజారే. మద్యం పాలసీ తనకు బాధ కలిగిస్తోందని గురువు చెప్పాక కూడా కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు. అధికారం అనే మత్తులో ఉన్నావంటూ శిష్యుడికో హెచ్చరిక చేసి అన్నాహజారే మౌనంగా ఉండిపోయినా ఇప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతోంది. అన్నాహజారేతో చేతులు కలిపి, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరి.. 2012లో సొంత పార్టీ పెట్టి, ఏడాది తిరక్కముందే ఢిల్లీ సీఎం అయిన అదృష్టవంతుడు కేజ్రీవాల్. రెండురాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి, నాలుగు రాష్ట్రాల్లో పాగా వేసి దేశరాజకీయాల్లో ఆయనో సంచలనంగా మారారు. కానీ పన్నెండేళ్లు తిరిగేసరికి అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు.
కేజ్రీవాల్ పక్కా అవినీతిపరుడని ఈడీ వాదిస్తుంటే.. ఆయన నిజాయితీకి నిలువుటద్దమని ఆయన లీగల్ టీం న్యాయపోరాటం చేస్తోంది. లోపలున్నా, బైట ఉన్నా దేశం కోసమే పాటుపడతా అనేది కేజ్రీవాల్ తాజా నినాదం. ఎక్కువకాలం జైలుగోడల మధ్య ఉండాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్ ధీమాగా ఉన్నట్టుంది. కానీ ఈడీ మాత్రం ఆయన్నంత తేలిగ్గా వదిలేలా లేదు. కుంభకోణంలో కేజ్రీవాలే కీలక సూత్రధాని అని బలంగా వాదిస్తున్న ఈడీ ఆధారాలు బయటపెడుతోంది. సౌత్‌గ్రూప్ నుంచి కేజ్రీవాల్‌కు 300 కోట్లు అందాయని, పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆ అవినీతి సొమ్మునే ఖర్చుపెట్టారని ఈడీ బలంగా వాదిస్తోంది.
సౌత్‌గ్రూప్‌కీ, ఆప్ సర్కార్‌కీ మధ్య మీడియేషన్ చేసిన అభిషేక్ నాయర్ నుంచి, ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న కవిత నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని కేజ్రీవాల్‌ని అష్టదిగ్బంధనం చేస్తోంది ఈడీ. కేజ్రీవాలే స్వయంగా డబ్బు డిమాండ్ చేశారన్న అభిషేక్ నాయర్ వాంగ్మూలం కీలకంగా మారింది. కేజ్రీవాల్ ఎన్నిరోజులు, ఎన్ని నెలలు జైల్లో ఉంటారు? అప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఆయన రాజీనామా చేస్తారా.. లేక.. ఆప్ నేతలు చెబుతున్నట్టు జైలునుంచే పరిపాలన సాగిస్తారా? అయితే ఒక ముఖ్యమంత్రి జైలునుంచి పరిపాలన కొనసాగించవచ్చా అంటూ రాజ్యాంగ నిపుణుల మధ్య తర్జన భర్జన మొదలైంది.
ప్రస్తుతానికి ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే. నేరం రుజువై రెండేళ్ల శిక్ష పడితేనే ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోతారు. అందుకే సాంకేతికంగా కేజ్రీవాల్ సీఎం హోదాలో కొనసాగవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా మాత్రం అది సాధ్యంకాదు. కేబినెట్ మీటింగులు, సమీక్షలు, సంతకాలు ఇవన్నీ కుదిరేపని కాదని నిపుణులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ని జైల్లో ఉంచకుండా హౌస్ అరెస్ట్ కోరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సలహా సంప్రదింపులతో లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన సాగించే ఆప్షన్ ఉన్నా దానికి ఆప్ సిద్ధంగా లేదు. కేజ్రీవాల్‌ని దెబ్బకొట్టేందుకు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలను కొట్టిపారయలేం. తప్పదనకుంటే తన సతీమణినో, కేబినెట్‌లో నమ్మకస్తులైనవారినో సీఎం పీఠం కూర్చోబెట్టడం కేజ్రీవాల్ ముందున్న మరో ఆప్షన్.