అందరూ సలహాలిచ్చేవారేనని ఆ మధ్య పవన్‌కల్యాణ్ వ్యంగాస్త్రం. నాలుగు అడుగులు వేసే ఓపికలేని చేగొండి హరిరామజోగయ్యలాంటి వారు ఎన్ని సీట్లు అడగాలో, ఎక్కడెక్కడినుంచి పోటీచేయాలో, సమీకరణాలు ఎలా ఉండాలో లేఖలు సంధిస్తుంటే జనసేనానికి చిరాకెత్తింది. నిజమే.. దిగేవాడికే తెలుస్తుంది లోతు. ఒడ్డున ఉండి ఎన్ని డైరెక్షన్లయినా ఇవ్వొచ్చు. కానీ చేగొండి సలహాలు, ముద్రగడ విమర్శలు పక్కనపెడితే పవన్‌కల్యాణ్ చేస్తున్నదేమిటి? 40సీట్లకు తగ్గరనుకుంటే సగానికి రాజీపడ్డ పవన్‌కల్యాణ్ చివరికి ఎవరికి కండువాలు కప్పుతున్నారు? ఎవరి చేతుల్లో టికెట్లు పెడుతున్నారు?
కండువా మారిస్తే టికెట్ గ్యారంటీ. అందుకే పారాచూట్ నేతలు లాస్ట్‌మినిట్‌లో జనసేనలో ల్యాండ్ అవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లని తన్నుకు పోతున్నారు. వలస నేతల దెబ్బకు ఒరిజినల్ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. కండువా మార్చెయ్.. టికెట్ పట్టెయ్ అన్న ఫార్ములా జనసేనలో బాగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి జనసేనలో చేరుతున్న నేతలకు టికెట్‌పై అభయం దొరుకుతోంది. వైసీపీ నుంచి కూడా జనసేనలోకి జంప్ కొట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కించుకున్నారు కొందరు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను కేటాయించారు. జనసేన నుంచి చాలామంది నేతలు కర్చీఫ్ వేసిన స్థానాల్లో కూడా టీడీపీ, వైసీపీ దిగుమతి నేతలే టికెట్లు దక్కించుకున్నారు. జనసేనకు కేటాయించిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి వైసీపీ నుంచి వచ్చి జనసేన కండువా కప్పుకున్న నేతకే దక్కింది. అసెంబ్లీ స్థానాల్లో కూడా మూడో వంతుకు పైగా సీట్లను టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన పారాచూట్ నేతలే దక్కించుకున్నారు. ఇది మొదటినుంచి జనసేననే ఒరిజనల్ నేతలకు మింగుడు పడకపోయినా, పొత్తు ధర్మం వారి కాళ్లకు బంధాలేస్తోంది.
టీడీపీ నుంచి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ ఆశించారు మండలి బుద్ధప్రసాద్. కానీ పొత్తులో ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేనలో చేరిన మండలికి దాదాపు లైన్ క్లియరైనట్లే! పాలకొండలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. జనసేనకు కేటాయించిన ఈ సీటును టీడీపీ నుంచి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇవ్వడం లాంఛనమే. అంతకుముందు టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేన కండువాను కప్పుకున్న పులపర్తి రామాంజనేయులుకే భీమవరం టికెట్ దక్కింది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్ దక్కింది.
విశాఖ సౌత్ సీటు కూడా పారాచూట్ నేతకే దక్కింది. వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్న వంశీకృష్ణ అక్కడ అభ్యర్థి అయ్యారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి డాక్టర్ యనమల భాస్కర రావు కూడా వైసీపీ నుంచి వాలిపోయిన నాయకుడే. ఇక దశాబ్దానికి పైగా వైసీపీతో కొనసాగిన బాలశౌరి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాటలే తప్ప చేతల్లేని జనసేనకు చివరికి టీడీపీ, వైసీపీ నేతలే దిక్కవుతున్నారు.
జనసేన 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్నప్పటికీ.. అందులో ఒరిజనల్ నేతలు 11 మందేనన్న టాక్ నడుస్తోంది. అటు బీజేపీకి 16 సీట్లు ఇచ్చినా.. మెజారిటీ లీడర్లంతా టీడీపీ వాళ్లేనని సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీ మధ్య ఓట్ షేర్ జరుగుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది.