పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం.. తాడే పామై కాటేయడంలాంటి సామెతలన్నీ ఇప్పుడు చంద్రబాబుకు వర్తిస్తాయేమో. ఆయన రాజకీయ జీవితంలోనే ఇంతటి విపత్కర పరిస్థితి ఇదే మొదటిసారి. ఎన్డీఏలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు జైల్లోపడితే మోడీ సర్కారు లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని, బీజేపీ అగ్రనేతలు టీడీపీ అధినేతకు టచ్‌లో ఉన్నారని కొంతమంది పులిహోర కలిపేశారు. కానీ మారిన సమీకరణాలతో ఏపీలో చంద్రబాబుకంటే జగనే కీలకమనుకుంటోంది బీజేపీ నాయకత్వం. అందుకే మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్‌పై కేంద్ర పెద్దలు నోరుమెదపలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆయన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదనపడ్డా అది బీజేపీ ఎకౌంట్‌లో పడలేదు.
నేషనల్‌మీడియాకి వాస్తవాలు చెబుతానంటూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు చంద్రబాబు పుత్రరత్నం. ఏపీలోనే ఆయన్ని ఎవరూ పట్టించుకోకపోతే ఢిల్లీలో దేకేదెవరు? గోడక్కొట్టిన బంతిలా వచ్చేశారు. ఎన్డీఏ పెద్దల అప్పాయింట్‌మెంట్ కూడా దొరక్కపోయేసరికి పాపం పుండుమీద కారంచల్లినట్లే ఉంది. చంద్రబాబు అండ్ కోకి నడిసంద్రంలో నావలా కనిపిస్తున్నారు పవన్‌కల్యాణ్. ఆయనే స్వయంగా జైలుకొచ్చి మద్దతివ్వడం, బయటికొచ్చి పొత్తు పెట్టుకుంటామని చెప్పటంతో టీడీపీకి పోయిన ప్రాణం లేచొచ్చింది. టీడీపీని కలుపుకుని పొత్తు పెట్టుకుందామని ఎప్పట్నించో జనసేనాని బీజేపీ పెద్దలకు చెబుతూ వచ్చారు. కానీ పవన్ వరకు ఓకేగానీ.. బాబుతో అంటకాగేందుకు సిద్ధంగా లేదు బీజేపీ.
చావయినా రేవయినా చంద్రబాబుతోనేనని పవన్‌కల్యాణ్ మొండికేస్తే ఆయన్ని కూడా వదిలేసుకోడానికి కమలంపార్టీ సిద్ధంగా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు ప్రయత్నాలపై ఇదివరకే కొన్ని ప్రచారాలు జరిగాయి. నలభై సీట్లన్నా జనసేన అడుగుతుందని, ఓ పదో పదిహేనో ఇచ్చి సరిపెడదామన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారనేది ఆ ప్రచారాల సారాంశం. జనసైనికులు హర్ట్ అయినా ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్లు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి నో ఛాయిస్. ఇన్నే సీట్లిస్తానని మొండికిపోతే పవన్‌కల్యాణ్ కూడా జారిపోతాడు. టీడీపీ అధినేత సంకటస్థితి ఓ రకంగా పవన్‌కల్యాణ్‌కి కలిసొస్తుంది. సీట్ల విషయంలో ఓ మెట్టు దిగాల్సిన అవసరం ఉండదు. గెలుపోటములు దేవుడెరుగు. ఇన్ని సీట్లు కావాలని పవర్‌స్టార్ పేచీపెడితే తలూపడమే తప్ప చంద్రబాబు ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.