వామ్మో.. ఇదేం కొట్టుడు!

ausisa-batsman-maxwell.jpg

91 పరుగులకే 7 వికెట్లు. టార్గెట్‌లో సగమైనా కొట్టకుండానే ఆస్ట్రేలియా చాప చుట్టేస్తుందనుకున్నారు. కానీ మాక్స్‌వెల్‌ ఒంటరిపోరాటం ఆస్ట్రేలియాను గెలుపుతీరాలకు చేర్చింది. పసికూనలాంటి ఆప్ఘనిస్తాన్‌కి ఓ సంచలన విజయం సాధించే అవకాశం చేజారింది. వన్డే ప్రపంచకప్‌లో ఇదో సంచలన ఇన్నింగ్స్‌. ముంబైలో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నమ్మశక్యం కాని విజయాన్ని సాధించింది. మ్యాక్స్‌వెల్‌ 128 బంతుల్లోనే 201 పరుగులు చేయటంతో ఇది సాధ్యమైంది.

21 ఫోర్లు, 10 సిక్సర్లు. ఇదీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు. ఆప్ఘనిస్తాన్‌ బౌలింగ్‌ని ఉతికి ఆరేశాడు మాక్స్‌వెల్‌. 292 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన ఆసీస్‌ టపటపా వికెట్లు కోల్పోయినా మాక్స్‌వెల్‌ కొండంత అండగా నిలిచాడు. ఈ విజయంతో ఆసీస్‌ జట్టు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. నాలుగో డౌన్‌లో వచ్చిన మ్యాక్స్‌వెల్‌ వికెట్ల దగ్గర పాతుకుపోయాడు. అతన్ని పెవిలియన్‌కు పంపేందుకు ఆప్ఘన్‌ బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వన్డేల్లో తొలిసారి డబుల్‌ సెంచరీ చేసిన మాక్స్‌వెల్‌ మరో 19 బంతులు మిగిలుండగానే సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆప్ఘనిస్తాన్‌ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 129 రన్స్‌తో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆసీస్‌ వంద పరుగుల్లోపే ఏడు వికెట్లు కోల్పోవటంతో ఆప్ఘన్‌ విజయం ఖాయమనుకున్నారు. అయితే మాక్స్‌వెల్‌ ఒంటిచేత్తో పోరాటం చేసి మ్యాచ్‌ని మలుపు తిప్పేశాడు. నిజానికి మాక్స్‌వెల్ మొదట్లోనే ఔట్ అవ్వాల్సింది. అతను గాల్లోకి లేపిన రెండు క్యాచ్‌లను ఫీల్డర్లు చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆఫ్ఘన్ టాప్-4లో చేరేది.

Share this post

submit to reddit
scroll to top