కొండకి వెంట్రుకేగా.. వేసేస్తే పోలా!

chandrababu.jpg

ఫిరాయింపులు, రేప్పొద్దున అనర్హత వేటు తర్వాత టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు. అయినా 44మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన రాజ్యసభ ఎన్నికలకు రెడీ అంటోంది విపక్షపార్టీ. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి వైసీపీనే మూడు రాజ్యసభ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కనకమేడల పదవీకాలం ముగియటంతో ఇక రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యమే ఉండదు. అందుకే సంఖ్యాబలం లేకపోయినా పోటీకి ఆ పార్టీ సై అంటోంది. కొండకి వెంట్రుక వేయాలనుకుంటోంది. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల మద్దతు దొరుకుతుందన్న దింపుడు కళ్లెం ఆశతో పోటీకి దిగుతానంటోంది.

చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదన్న సామెత ఊరికేరాలేదు. ఆ మధ్య ఎమ్మెల్యేల కోటాలో ఓ ఎమ్మెల్సీ గెలవటంతో అలాంటి అద్భుతమే మళ్లీ జరగొచ్చన్న అత్యాశతో టీడీపీ ఉన్నట్టుంది. తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో 23మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో పార్టీ వీడిన ఎమ్మెల్యేలు పోను ఇప్పుడున్న బలం 18 మాత్రమే. రాజీనామా ఆమోదం పొందటంతో గంటా మాజీగా మిగిలిపోయారు. నలుగురైదుగురైతే ప్రలోభాలు పెట్టే అవకాశం ఉండేది. కానీ టీడీపీ రాజ్యసభ సీటు గెలవాలంటే ఉన్న ఎమ్మెల్యేలు కాక మరో పాతికమంది కావాలి. అంతమంది ఎక్కడినుంచి ఊడిపడతారో, ఎలా మద్దతిస్తారో టీడీపీకే తెలియాలి. సీట్లు నిరాకరించటంతో వైసీపీలో కొందరు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. అలాంటి వారంద‌రినీ ఏదోలా తన వైపు తిప్పుకోవడానికి బేరసారాలకు దిగే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబుకి చెప్పుకోదగ్గ ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఆ ధైర్యంతోనే.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేస్తామని ఎగిరెగిరి పడుతోంది.

టీడీపీ ప్రయత్నాలు ఎలా ఉన్నా.. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లనీ దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.రాజ్యసభ స్థానాల్ని మొత్తం అసెంబ్లీ సీట్లతో విభజించగా వచ్చిన ఫలితానికి ఒకటి కలపాలి. అంటే.. ఒక్కో రాజ్యసభ సీటు గెలవడానికి 44మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీలో రెండు పార్టీల నుంచి 9 మందిపై అనర్హత పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. గంటా రాజీనామాని ఆమోదించారు. దీంతో ఈ పది మందిమీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్యా బలం 165కి చేరుతుంది. అప్పుడు ఒక్కో సీటుకు అవసరమైన బలం 43 ఓట్లు. అప్పుడు టీడీపీకి 18 మంది, వైసీపీకి 147 ఎమ్మెల్యేల బలం ఉంటుంది. మూడు రాజ్యసభ సీట్లు గెల్చుకునేందుకు వైసీపీకి కావాల్సిన సంఖ్యాబలం 123. అదనంగా ఉన్నది 24 మంది. ఇందులో ఎంతమంది అసంతృప్తులు బయటికి వెళ్తారన్నదే ప్రశ్న.

కొందరు అసంతృప్తులు టీడీపీకు ఓటేసినా తమకు అదనంగా 24మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మూడు సీట్లూ గొలుస్తామన్న ధీమాతో ఉంది వైసీపీ. అయితే పోయినేడాది ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చివరి నిమిషంలో అనూహ్యంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిచింది. టికెట్లు రాని వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అసంతృప్తినే నమ్ముకుని రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే ప్రయోగం చేయాలనుకుంటోంది. గెలవడానికి అవసరమైన 43మంది మద్దతు దొరికినా దొరకకపోయినా వైసీపీని ఆత్మరక్షణలో పడేయాలన్నది టీడీపీ వ్యూహం. ఎన్నికలముందు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతో కొంతమంది క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడితే అధికారపార్టీని ఇరకాటంలో పడేయొచ్చు. ఆ వ్యూహంతోనే పోటీకి సై అంటోంది టీడీపీ.

Share this post

submit to reddit
scroll to top