ఆత్మీయంగా అంతిమ క్షణాలు!

ductch-ex-pm-couple-mercy-killing-1.jpg

ఓ దేశ మాజీ ప్రధాని. సతీసమేతంగా కారుణ్యమరణాన్ని పొందారంటే నమ్మగలమా? బతుకుకంటే చావు ఎందుకు సుఖమనుకున్నారో తెలిస్తే తట్టుకోగలమా? పైనుంచి పిలుపొచ్చేదాకా చావు ఘడియలు లెక్కపెట్టుకునేవారు కోకొల్లలుగా ఉన్న సమాజంలో మన ఊహకు కూడా అందని ముగింపు ఇది. 93 ఏళ్ల డచ్‌ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ అటు తన వయసే ఉన్న భార్య యూజినీతో స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించారు. చివరిక్షణాలను కూడా ఆస్వాదించారు.

ఎన్నో ఏళ్లు కలిసి బతికారు. కలిసే చనిపోవాలని అనుకున్నారు. శరీరం సహకరిస్తే ఇంకొన్నాళ్లు కలిసిమెలిసి ఈ లోకంలోనే ఉండేవారేమో. కానీ వృద్ధాప్యం ఆరోగ్యాలను కుంగదీసింది. ప్రతీక్షణం భారంగా గడుస్తోంది. అందుకే ఈ జీవితం ఇక చాలు అనుకున్నారు. మరణించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఆత్మహత్య మహాపాపం కదా, అదికూడా నేరమే కదా అంటారా. ఆ దేశంలో అనివార్య పరిస్థితుల్లో చావు చట్టబద్ధమే. అందుకే ఆ దేహాలను జీవం త్యజించేదాకా చేతిలో చేయి వేసుకుని కళ్లల్లో కళ్లుపెట్టి చూసుకుంటూ ప్రశాంతంగా కన్నుమూశారు.

డచ్‌లోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో మెర్సీ కిల్లింగ్‌ కొత్తేమీ కాదు. కొన్ని దేశాల్లో అది చట్టబద్ధం. సహజమరణం కాదు. అలాగని ఆత్మహత్య కూడా కాదు. అనుమతి తీసుకుని నొప్పి లేకుండా, వైద్యుల సాయంతోనే ప్రాణాలొదలడమే ఈ కారుణ్య మరణ పరమార్ధం. డచ్‌ మాజీ ప్రధాని దంపతులకు ఎన్నో అనారోగ్య సమస్యలు. ఆయనకు ఓసారి బ్రెయిన్ హేమరేజ్ వచ్చి ప్రాణాలతో బయటపడ్డా పూర్తిగా కోలుకోలేదు. ఆయన సహధర్మచారిణికి వయసు మీదపడే కొద్దీ చెప్పలేనన్ని అనారోగ్య సమస్యలు. తొమ్మిదిపదుల జీవితాన్ని బతికాం.. ఇంకా ముక్కుతూమూలుగుతూ అడుగుతీసి అడుగేయడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఇంకా బతికుండాలా.. చావెప్పుడు వస్తుందా అని ఎదురుచూడాలా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. కలిసి బతికాం.. ఈలోకంనుంచి శాశ్వతంగా కలిసే వెళ్లిపోదాం అని అనుకున్నారు.

డెబ్భైఏళ్లు తనతో కలిసి నడిచిన అర్ధాంగి చేతిని పట్టుకుని ఆర్ధ్రంగా ఆమె కళ్లలోకి చూస్తూ తనువు చాలించాడు ఆ పెద్దాయన. కొన్ని క్షణాలు అటూఇటుగా ఇద్దరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతే ఆ దృశ్యం చూసి చెమర్చని కళ్లు లేవు. చావు బాధాకరమే. కానీ ప్రతీక్షణం నరకం అనుభవించేకంటే.. రేపు ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు చనిపోయి మరొకరు ఒంటరిగా కుమలిపోయేకంటే ఈ చావు ఎంతో ప్రశాంతం. పూటగడవకపోయినా, నా అన్నవారు లేకపోయినా, ఉన్నవాళ్లెవరూ పట్టించుకోకపోయినా ఎన్నో దేశాల్లో (మనం కూడా) అలా బతికేయాల్సిందే. కొందరు బతకలేక ప్రాణాలు తీసుకున్నా దానివెనుక అంతులేనంత సంఘర్షణ. దానికంటే ఈ కారుణ్య మరణమే కాస్త నయమనిపించడం లేదూ.

యూథనేసియా. డచ్‌లో మరణానికి అనుమ‌తించేందుకు సాంకేతికంగా వాడే పదం ఇదే. ఎలా బతకాలన్న భయంలేదు. భవిష్యత్తు గురించి బెంగేలేదు. స్వేచ్ఛగా వైద్యుల పర్యవేక్షణలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు కొన్ని దేశాలు కల్పించిన అవకాశం. అనుమతిపొందినవారికి వైద్యులు ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇస్తారు. సాధారణంగా మత్తును కలిగించే ఇంజక్షన్లనే ఓవర్‌డోస్‌ ఇవ్వడం వల్ల దేహం ఏ నొప్పీ తెలియని స్థితిలోకి వెళ్లిపోతుంది. కాసేపటికే అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. డెత్ సర్టిఫికెట్ మీద సంతకాలు చేసి వైద్యులు ఆ దేహాల్ని అయినవాళ్లకి అప్పగిస్తారు. ఇది స్వచ్ఛంద మరణం వెనుక జరిగే ప్రక్రియ. పొరపాటున మన దేశంలో ఇలాంటి మరణాలకు అనుమతిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించడం కూడా కష్టమే!

Share this post

submit to reddit
scroll to top