విలువ‌ల వ‌లువలు విడిచేసిన రాజ‌కీయం!

brs-mlas-met-revanthreddy.jpg

అవకాశవాద రాజకీయం. లాభనష్టాలనే చూసుకునే కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావటంతో రాజ‌కీయాల్లో విలువ‌లు వ‌లువ‌లు వ‌దిలేసి దిగంబ‌రంగా తిరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయమైతే మ‌రీ నిర్లజ్జగా తయారైంది. ఒకప్పుడు ఓవర్ లోడ్ అయిన కారు ఇప్పుడు క్రమంగా ఖాళీ అవుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఖాళీ అయినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ నేత‌లు పొలోమ‌ని పార్టీ వీడుతున్నారు. ఊసరవెల్లులు కూడా ఈ కాలపు నాయకుల్ని చూసి సిగ్గుపడుతున్నాయ్. ఇంత ఫాస్ట్‌గా రంగులు మార్చడం పాపం వాటివల్ల కూడా అయ్యేలా లేదు. ఇంత చాకచక్యంగా గోడ దూకడం తమకు రాదే అని పిల్లులు కూడా ఈ నాయ‌కుల్ని చూసి తలదించుకుంటున్నాయ్.

పచ్చి అవకాశవాదం. పదవులు కావాలి, పైసలు సంపాదించుకోవాలి. లేదా ఆస్తులు కాపాడుకోవాలి. ఇదే లక్ష్యం. జనం ఏమనుకుంటారోనన్న భయమే లేదు. మొహాన ఊస్తారన్న సిగ్గూఎగ్గు అస్సలు లేవు. కారు పార్టీకి గుడ్‌బై చెప్పింది ప్రస్తుతానికి నలుగురైదుగురే కావొచ్చు. ముఖ్యమంత్రిని కలిసొచ్చింది ఐదారుగురే కావొచ్చు. కానీ ఇదో సంకేతం. అధికారంలో ఉన్నప్పుడు ఈ లీడర్లే పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కారు. ఖాళీ లేదనకుండా అప్ప‌టి ఏలిన‌వారు కూడా ఎంతమంది వచ్చినా కారెక్కించేశారు. ఇప్పుడు బండి సర్వీసింగ్‌కి వచ్చేసరికి ఒక్కొక్కరూ దిగిపోతున్నారు.

డిసెంబరు 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. ఆరోజే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నారని ప్ర‌చారం జ‌రిగింది. ఆనాడు ఆ వార్త నిజం కాదన్నారు. ఇప్పుడు ఆ నిజాన్ని కాదనలేకపోతున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే బీఆర్ఎస్‌ అధిష్ఠానానికి షాక్‌ ఇస్తూ ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసొచ్చారు. కాస్త గ్యాప్‌ తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా సీఎంని కలిశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నా ఏం జరగబోతోందో తెలంగాణ ప్రజలు ఓ అంచనాకొచ్చేశారు.

పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత పార్టీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఓడిపోయిన ఈయనకు నాలుగు నెలలు తిరక్కుండానే పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ ఎంపీ టికెట్‌ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన అవకాశంతో ఎంపీగా గెలిచిన వెంకటేష్‌ నేత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, జహీరాబాద్‌ ఎంపీ పాటిల్‌ ఇద్దరూ జంప్‌. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ఎంపీగా గెలిచిన పాటిల్‌ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. కండువా మార్చినందుకు రాములు కొడుకు భరత్‌ నాగర్‌కర్నూల్‌ బీజేపీ టికెట్‌ సంపాదించారు. దీంతో ఆ పార్లమెంట్‌ నియోజకవర్గ టికెట్‌ ఆశించిన బంగారు లక్ష్మణ్‌ కూతురు శృతి వెంటనే వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసొచ్చారు.

పార్టీలు మారిన‌వారిలో కాస్త‌ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురించి. పార్టీ మారొద్దు, మీరు మాకు చాలా ముఖ్యం అని చెప్పడానికి టికెట్ ఇవ్వ‌లేక‌పోయినా ఆగ‌మేఘాల మీద గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న్నికేబినెట్‌లోకి తీసుకుంది. అది మూడునెలల పదవేనన్నది పక్కనపెడితే పార్టీ ఆయనకు అంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వం మారగానే ఆయ‌నగారు కుటుంబ సమేతంగా వెళ్లి రేవంత్‌రెడ్డి ద‌ర్శ‌నం చేసుకున్నారు. కండువా మార్చినందుకు ప్రతిఫలంగా ఆయన భార్య సునీతా మహేందర్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ దక్కబోతోంది.

2018లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలోకి చేరిపోయారు. అంతకు ముందు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. వారిలో ఒకరిద్దరు మంత్రులు కూడా అయ్యారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీ మారి మంత్రి పదవులు వెల‌గ‌బెట్టారు. ప్రజల తీర్పుపై ప్రజాప్రతినిధులకు గౌరవమే లేదు. అదే ఉండి ఉంటే.. ఏమాత్రమైనా విలువలు ఉండుంటే రాజీనామా చేసిన తరువాతే పార్టీ మారేవారు. మళ్లీ ప్రజాతీర్పుకి సిద్ధపడేవారు. ఈ జంప్‌ జిలానీల్లో అలాంటి నిజాయితీ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉన్నారా? ఆత్మగౌరవం లేని నాయకుల దగ్గర విలువలు ఆశించడం అత్యాశే కదా!

Share this post

submit to reddit
scroll to top