అన్యాయం జరిగింది నిజమే.. మీరేం చేశారు?

jagan_kcr_modi.jpg

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తొమ్మిదేళ్లు గడిచింది. ఏడెనిమిది నెలల్లో రెండు తెలుగురాష్ట్రాలకు రెండోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయ్‌. తమ రాష్ట్ర ప్రజల జీవనప్రమాణాల గురించి తెలంగాణ గొప్పగా చెప్పుకుంటోంది. తలసారి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. అటు విభజన తర్వాత ఇప్పటికీ రాజధాని ఏదో తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఆంధ్ర రాష్ట్రం ఉంది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అమరావతి రాజధానిగా పునాదులేస్తే.. తర్వాత గెలిచిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ విశాఖవైపు దృష్టిసారించింది.

హైదరాబాద్‌లాంటి మహానగరం రాజధానిగా ఉండటం తెలంగాణకున్న సానుకూలత. రెండుసార్లు అధికారంలోకొచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పంపకాల పంచాయితీ పూర్తికాలేదు. విభజనచట్టంలో ఇచ్చిన హామీలు కొన్ని రెండు రాష్ట్రాల్లో నెరవేరలేదు. ఏపీకి అప్పట్లో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అయితే ముగిసిన అధ్యాయంగా మిగిలిపోయింది. ఎవరో వస్తారు ఏదోచేస్తారని చూడకుండా రెండు తెలుగురాష్ట్రాలు సొంత కాళ్లపై నిలబడ్డాయి. స్వాభిమానంతో ముందుకెళ్తున్నాయి.

రాష్ట్ర విభజన యూపీఏ హయాంలో జరిగి ఉండొచ్చు. ఆరోజున్న ఉద్రిక్త పరిస్థితుల్లో పార్లమెంట్‌ తలుపులు మూసి బిల్లుపాస్‌ చేయాల్సి వచ్చింది. ఆ ఘట్టాన్ని ఇప్పుడు తప్పుపట్టాల్సిన పన్లేదు. ఆ రోజు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పూర్తి మద్దతిచ్చింది. బీజేపీ పెద్దలు ఆరోజు సభలోనే ఉన్నారు. బీజేపీ మద్దతివ్వకుండా ఆరోజు విభజన ప్రక్రియ జరిగేదే కాదు. కానీ ప్రధాని మోడీ ఆ విషయాన్ని పదేపదే విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత కూడా అప్పటి విభజన సరిగా జరగలేదని ఆయన ప్రస్తావించడం పుండుమీద కారం చల్లడమే.

వాజ్‌పేయి హయాంలో వివాదరహితంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడి ఉండొచ్చు. బీజేపీ గొప్పగా చెప్పుకోడానికి అదో అంశం కావచ్చు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన ఎన్నో భావోద్వేగాలతో ముడిపడ్డ అంశం. కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఆకాంక్ష. అంత కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకాభిప్రాయం సాధ్యంకాదన్న విషయం తెలిసికూడా బీజేపీ దీన్ని రాజకీయంచేయాలనుకుంటోంది. కాంగ్రెస్‌ విభజన విషయంలో సరిగా వ్యవహరించలేదన్నప్పుడు తప్పులు సరిచేయాల్సిన బాధ్యత బీజేపీకిలేదా? రెండుసార్లు అధికారంలోకొచ్చి మూడోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఏనాడైనా సమన్యాయానికి ప్రయత్నించిందా?

జమ్మకశ్మీర్‌లో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆర్టికల్‌ 370ని రద్దుచేసిన మోడీ సర్కారు తలుచుకుంటే తెలుగురాష్ట్రాలకు న్యాయం చేయలేదా? విభజన సమయంలో జరిగాయంటున్న తప్పులను ఈపాటికే సరిదిద్దాల్సింది కాదా? చట్టంలో స్పష్టత లేదనో, నీతిఆయోగ్‌ వచ్చాక విధానాలు మార్చుకున్నామనో వంకలు చెప్పడం తప్ప రెండు తెలుగురాష్ట్రాలకు రెండు దఫాల పాలనలో ఎన్డీఏ ఒరగబెట్టిందేంటి? కాంగ్రెస్‌ ఆ పనిచేయలేకపోయింది.. మేం ఇది చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవచ్చుగా! అవకాశం దొరికినప్పుడల్లా గాయాన్ని కెలకడం తప్ప మోడీ సర్కారు ఇంకేమన్నా చేస్తోందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలొస్తున్నాయి కాబట్టి మొసలి కన్నీరు కార్చడం తప్ప కేంద్ర సర్కారుకు ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉందా?

Share this post

submit to reddit
scroll to top