నెల్లూరు బరిలో పెద్దారెడ్లు!

vemireddy-sarathchandrareddy.jpg

నెల్లూరు రాజకీయాలే అంత. ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టవు. 2019లో జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీలో అంతర్మథనం. ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో టీడీపీలో ఎప్పుడూ లేనంత సమరోత్సాహం. ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఆర్థికంగా, వర్గపరంగా బలంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి కూడా వైసీపీని వీడారు. నెల్లూరు టీడీపీ ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.

మా వెనుక రెడ్డిగారున్నారని మొన్నటిదాకా వైసీపీ అభ్యర్థులు నమ్మకం పెట్టుకుంది ఆయనమీదే. వేమిరెడ్డి జంపింగ్‌తో రెండు పార్టీల్లో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. వేమిరెడ్డి లోటును భర్తీచేసేదెవరని వెతికిన వైసీపీకి బంగారు తునకలా దొరికారు మరో సౌండ్‌ పార్టీ. పెనకా శరత్ చంద్రారెడ్డి. ఫార్మా కంపెనీ అధినేత. రెండు పార్టీల్లోనూ సింహపురి సింహాలు రెడీ అయినట్లే. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా అధినేత. ఇండస్ట్రియలిస్ట్‌గా వైఎస్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధాలున్న వ్యక్తి. పైగా విజయసాయిరెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. అన్నీ బేరీజు వేసుకున్నాకే నెల్లూరు గడ్డపై వేమిరెడ్డితో తలపడేందుకు సరైన ప్రత్యర్థి ఆయనేనని వైసీపీ ఫిక్సయింది.

2019 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్నీ వైసీపీనే గెలిచింది. ఎంపీ సీటును కూడా లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. ఈసారి సామాజిక సమీకరణాలకు తోడు ఆర్థికంగా బలమైన అభ్యర్థులపై జగన్‌ పార్టీ గురిపెట్టింది. నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ అభ్యర్థి ఖలీల్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటిదాకా రెడ్డి సామాజికవర్గానికి అడ్డాగా ఉన్న కందుకూరు నుంచి బీసీ మహిళని దించింది. బీసీ, మైనారిటీ ఓటుబ్యాంకులు బలపడి గతంకంటే ఓట్ల శాతం పెరుగుతుందన్న ధీమాతో ఉంది వైసీపీ. జిల్లాలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌ మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది. వేమిరెడ్డి రాక ఆ పార్టీకి టానిక్‌లా పనిచేస్తోంది.

నెల్లూరు ఎంపీ బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి దిగుతున్నవాళ్లే. వీళ్లిద్దరి ఎంట్రీతో సింహపురి రాజకీయం రసవత్తరంగా మారింది. తనకు గౌరవం లేనిచోట ఉండబోనంటూ బైటికెళ్లిన వేమిరెడ్డి ఈ ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. నెల్లూరు రాజకీయాల్లో పెద్దపీట వేసినా పోతూపోతూ బట్టకాల్చి మొహాన వేసిన వేమిరెడ్డికి ఓటమి రుచిచూపిస్తానంటోంది వైసీపీ. ఇద్దరు అభ్యర్థులకే కాదు.. రెండు పార్టీల అధిష్టానాలకు కూడా ఈసారి సింహపురి సమరం ప్రతిష్టాత్మకమే!!

 

Share this post

submit to reddit
scroll to top