హమాస్ మెరుపుదాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు భారత ప్రధానితో మాట్లాడారు. ఇజ్రాయిల్‌కి మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీ ఆ దేశానికి అన్ని విధాలా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ఇజ్రాయిల్‌కి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. ఇజ్రాయిల్‌పై పాలస్తీనా ఉగ్రవాదుల దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంటే కొన్ని దేశాలు తటస్థంగా ఉన్నాయి. భారత్ వైఖరిపై అంతా ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో మన దేశం ఇజ్రాయిల్‌కే మద్దతు ప్రకటించింది.
భూమి, జల, వాయు మార్గాల్లో హమాస్ ఒక్కసారిగా దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అస్సలు ఊహించలేదు. మారణహోమంతో మండిపడుతున్న ఇజ్రాయిల్ ప్రతీకారదాడులతో విరుచుకుపడుతోంది. గాజాని శిధిలాల గుట్టగా మార్చేస్తోంది. హమాస్ యుద్ధం ఆరంభించిందని, దాన్ని తాము ముగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటించారు. హమాస్‌పై ఆఖరియుద్ధానికి సిద్ధమైంది ఇజ్రాయిల్. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాల్ని నిషేధించింది. ఏకంగా లక్ష మంది సైన్యాన్ని రంగంలోకి దింపి గాజాని ఆక్రమించాలనుకుంటోంది. ఈ భీకర యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ వైపే నిలిచింది మన దేశం.
ఇజ్రాయిల్‌పై హమాస్‌దాడిపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలిస్తే మరికొన్ని దేశాలు పాలస్తీనియన్ల హక్కులను హరించడమే ఈ పరిస్థితికి కారణమని నిందిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌ని ఈ యుద్ధం దౌత్యపరంగా సంకటంలో పడేసింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభంపై ఎలాంటి ప్రకటన చేయకున్నా.. ప్రధాని మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇజ్రాయిల్‌కి స్పష్టమైన మద్దతు పలకటంతో మనదేశ వైఖరిని ప్రపంచానికి చెప్పినట్లయింది.
మన పొరుగునే ఉన్న చైనా ఈ పరిణామాలపై భిన్నంగా స్పందించింది. పాలస్తీనా భూభాగంలోని వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఇజ్రాయిల్ నిర్మాణ కార్యకలాపాలను చైనా వ్యతిరేకించింది. మరో పొరుగుదేశం పాకిస్తాన్ ఇజ్రాయిల్‌నే నిందించింది. ఇజ్రాయిల్ ఆక్రమణలే ఈ హింసాత్మక పరిస్థితులకు కారణమంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆరోపించారు. పాలస్లీనియన్ల హక్కులను, అధికారాలను ఇజ్రాయిల్ హరిస్తుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నట్లు పాకిస్తాన్ ప్రధాని స్పందించారు.
ఢిల్లీలో జరిగిన G20 సదస్సు సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్‌లు భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ని ప్రకటించాయి. అయితే నెలతిరిగేలోపే ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధం మొదలైంది. సౌదీ అరేబియాతో ఇజ్రాయిల్ సన్నిహిత సంబంధాల కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో హమాస్ దాడి జరిగింది. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను హరించడమే ఈ సంక్షోభానికి కారణమని సౌదీ అరేబియా స్పందించింది. ఈ ప్రకటనతో ఇజ్రాయిల్‌కి దగ్గరయ్యేందుకు సౌదీ సిద్ధంగా లేదన్న విషయం అర్ధమైపోయింది.
భారతదేశం ఇజ్రాయిల్‌ని 1950లో గుర్తించింది. మతప్రాతిపదికన దేశ విభజన అనుభవాలతో భారత్ మొదట్లో ఇజ్రాయిల్ ఆవిర్భావాన్ని వ్యతిరేకించింది. అరబ్ దేశాల్లోని స్నేహితుల మనోభావాలను కించపరచకూడదనే భారత్ ఇజ్రాయిల్‌ని గుర్తించడం లేదని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పట్లో ప్రకటించారు. యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌కి మద్దతు ఇవ్వడంలో ఎన్నో ఏళ్లపాటు ఇజ్రాయిల్‌తో భారత్ సంబంధాలు అంతంతమాత్రమే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు కూడా పాలస్తీనా ఉద్యమానికి మద్దతునిచ్చాయి. 1962 భారత్-చైనా యుద్ధంలో తటస్థంగా ఉన్న అరబ్‌దేశాలు 1965, 1971 యుద్ధాల సమయంలో పాకిస్తాన్‌కి మద్దతునిచ్చాయి. ఆ తర్వాతి పరిణామాలతో భారత్ కూడా మిడిల్ ఈస్ట్‌పై వ్యూహాన్ని మార్చుకుంది.
ఇజ్రాయిల్‌తో భారత్ పూర్తి స్థాయి దౌత్య సంబంధాలను ఏర్పరుచుకుంది 1992లోనే. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ సైనిక సామాగ్రిని సమకూర్చి మనదేశంతో బంధం బలపరుచుకుంది. పాలస్తీనా వాదానికి మద్దతిస్తూనే ఇజ్రాయిల్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. 2018లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కి భారతదేశం ఆతిథ్యం కూడా ఇచ్చింది. ఇజ్రాయిల్‌పై హమాస్‌దాడితో భారత్ సంకటంలో పడ్డా.. అంతిమంగా ఇజ్రాయిల్‌కే నైతిక మద్దతు ప్రకటించింది.
సౌదీ అరేబియాతో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. అదే సమయంలో ఇజ్రాయిల్ భారత్‌కి అతిపెద్ద ఆయుధ భాగస్వామిగా ఉంది. 2017లో ఇజ్రాయిల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీనే. ఏడాది తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు భారత్ పర్యటనకు వచ్చారు. అందుకే భారత్ ఇప్పుడు ఇజ్రాయిల్‌వైపు నిలిచింది. ఇజ్రాయిల్-భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడొచ్చు. కానీ అదే సమయంలో అరబ్ దేశాల స్పందన ఎలా ఉంటుందన్నది కూడా చూడాలి. ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధం మారణహోమానికి దారితీస్తే ప్రపంచదేశాలు చెరోవైపు చీలిపోయేలా ఉన్నాయి. కప్పదాటు వైఖరికంటే స్పష్టమైన విదేశాంగ విధానం ఉండటం మంచిదే. మంచయినా చెడయినా మన వైఖరేమిటో ప్రపంచానికి తెలుస్తుంది.