కోట్లు పెట్టి సిన్మాలు తీస్తారు. కాల్షీట్ల ప్రకారం ఎవరు రాకపోయినా ఆ నష్టాల్ని భరిస్తూ నానా తిప్పలు పడి సిన్మాని రిలీజ్ దాకా తీసుకొస్తారు. ఎవరయినా డబ్బులెక్కువై సిన్మా తీయరు. హిట్ కాకపోయినా నష్టం లేదని ఎవరూ అనుకోరు. ఎవరి టార్గెట్టయినా సిన్మా బాగా ఆడాలనే. నాలుగు డబ్బులు రావాలనే. అలాగని అన్ని సిన్మాలు సక్సెస్ కావు. కొన్ని యావరేజ్‌గా ఆడితే మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతుంటాయ్. అయితే సిన్మా ఆడిందా ఆడలేదా.. బాగుందా బాగోలేదా అన్న చర్చలో విమర్శకుల అత్యుత్సాహం ఇంకాస్త నష్టంచేస్తోంది.
ఓ సిన్మా రిలీజ్ అయిందంటే ఎవడి రివ్యూ వాడిది. ఒకరు 3 రేటింగ్ ఇస్తే మరొకరు 2లోపే ఇస్తారు. టేకింగ్‌నుంచి యాక్టింగ్‌దాకా, డైలాగులనుంచి పాటలదాకా అదలా ఉందీ ఇదిలా ఉందీ… ఇలాకాదు అలా ఉండాల్సిందని ఒక్క షో చూసేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. ఇందులో పర్సనల్ ఇంట్రస్టులుంటాయి. మనకు కావాల్సిన సిన్మా బాగోకపోయినా ఎత్తేస్తాం. మనకు ఇంట్రస్ట్ లేని సిన్మా బాగున్నా ఉతికి ఆరేస్తుంటాం. సిన్మా బాగున్నప్పుడు రివ్యూలు ఎలా రాసుకుంటేనేం అంటారా. అదెలా కుదురుతుంది. రివ్యూలను బట్టి ఆ సిన్మామీద ఓ అంచనాకొచ్చే వర్గాలు కూడా ఉంటాయి.
అన్ని భాషల్లో రోజూ ఏదో ఒక కొత్త సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. థియేటర్స్‌లో రిలీజైనా, ఓటీటీలో వచ్చినా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్స్ సోషల్‌మీడియాలో రివ్యూలు రాస్తుంటారు. కొన్ని వెబ్‌సైట్స్ తమకు తోచిన రేటింగ్స్ ఇచ్చేస్తుంటాయ్. రివ్యూ దారుణంగా రాశారని బాధపడి వదిలేసేవారే కాదు.. అలా ఎలా రాస్తావని గల్లా పట్టేవాళ్లు కూడా ఉంటారు. రహెల్ మకాన్ కోరా అనే మలయాళీ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఉబైనీ ఈ సిన్మా డైరెక్టర్. ఈసిన్మా మీద కొందరు యూట్యూబర్లు తమకు ఇష్టమొచ్చినట్లు రివ్యూలు ఇవ్వటంతో డైరెక్టర్ ఉబైనీ సీరియస్‌గా వారు మరిచిపోలేని షాక్ ఇచ్చారు.
తమ సినిమాపై విష ప్రచారం చేస్తున్నారని డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. పుట్టగొడుగుల్లా ఎన్నో యూట్యూబ్ ఛానళ్లు పుట్టుకొస్తున్నాయి. ఇక వెబ్‌సైట్లకైతే లెక్కేలేదు. ఇలా ఎవరికితోచినట్లు వాళ్లు రాసేస్తుంటే సిన్మాలేమైపోవాలి. మళయాళీ డైరెక్టర్ ఇప్పుడు సిన్మా ఇండస్ట్రీకి మంచి దారి చూపించినట్లే. రివ్యూలతో విరుచుకుపడదామనుకునేవారంతా కాస్త వెనుకాముందు చూసుకోవాల్సిందే ఇంక.