టీడీపీ, జనసేన కూటమిని టార్గెట్ చేసేందుకు వైసీపీ సరికొత్త అస్త్రం ప్రయోగించబోతోంది. కాపు ఉద్యమ నేత ద్వారా ఈ రెండుపార్టీలకు చెక్ చెప్పేందుకు జగన్ టీమ్ సిద్ధమవుతోంది. ఏపీలో ఎన్నికలకు మూడ్నెల్లే సమయం ఉండటంతో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలో సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వైసీపీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. చాలాచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి సిద్ధమైంది.
అభ్యర్థుల మార్పులతో పాటు వైసీపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని పార్టీలో చేర్చుకుంటోంది. వైసీపీలోకి వస్తే ముద్రగడ ఫ్యామిలీకి ఏ రకమైన పదవులు ఇస్తామనే దానిపై కూడా వైసీపీ నాయకత్వం క్లారిటీ ఇచ్చేసింది. ముద్రగడకు 2024లో రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు ఆయన కుమారుడు గిరికి ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.
కమ్మ కాపు ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందన్న అంచనాతో టీడీపీ-జనసేన ఉన్నాయి. తెలంగాణలో అధికారం మారటంతో ఏపీలో కూడా అదే జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే వైసీపీ అంతకంటే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముద్రగడ రాక కలిసొస్తుందని వైసీపీ అంచనావేస్తోంది. ముద్రగడ ద్వారా కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. ముద్రగడ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మళ్లీ పట్టు నిలుపుకోవచ్చని వైసీపీ భావిస్తోంది.