కులమే బలం.. తెలంగాణ రాజకీయం!

telangana-caste-politics.jpg

ఆంధ్రప్రదేశ్‌లా తెలంగాణ రాజకీయాల్లో కులాల ప్రభావం అంత ఉండదు. కానీ ఈసారి లెక్కమారిపోయింది. తెలంగాణలో మొదటిసారి కుల సమీకరణాల చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తోంది. సామాజికవర్గాల ఓట్ల బలం చూపించి నేతలు సీట్లు డిమాండ్ చేస్తున్నారు. అడిగినన్ని సీట్లు ఇస్తే ఓట్లన్నీ గంపగుత్తగా మీకేనని పార్టీలకు బంపరాఫర్‌ ఇస్తున్నారు. గతంలో బీసీలు మాత్రమే జనాభాకు తగ్గ సీట్లు అడిగే పరిస్థితి ఉండేది. అడిగినన్ని కాకుండా ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చినా చివరికి సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు బీసీల్లో కూడా ఉప కులాల వారీగా సీట్లు కోరుతున్న పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారి కనిపిస్తోంది. దశాబ్ధాలుగా ఏలుతూ వచ్చిన అగ్రవర్ణాలు కూడా ప్రత్యేకంగా సీట్లు డిమాండ్లు చేస్తుండటం ఆశ్చర్యకర పరిణామం. మీరు సీట్లిస్తే ఓట్ల సంగతి మేం చూసుకుంటామని కులసంఘాల పెద్దలు పార్టీలకు భరోసా ఇస్తున్నారు.

బీసీల్లో ముదిరాజ్‌లు తెలంగాణలో ఈసారి తమకు జరిగిన అన్యాయంపై గట్టిగా గొంతెత్తుతున్నారు. బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌లకు 11 ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాల్సిందేనంటున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉండగా ఆ పార్టీనుంచి ఆయనొక్కరే ముదిరాజ్‌ నేత. ఆయన బీజేపీలోకి వెళ్లాక ముదిరాజ్‌ సామాజికవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్టీ వీడి కొందరు పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్‌ కూడా తన సామాజికవర్గం తరపున గొంతెత్తుతున్నారు. తెలంగాణలో ఉన్న 60 లక్షల ముదిరాజ్‌ జనాభాకు తగ్గట్లు కనీసం 11 సీట్లయినా ఇవ్వాల్సిందేనంటున్నారు. బీఆర్‌ఎస్‌ని ఇరుకున పెట్టేందుకు ఈటల ఈ డిమాండ్‌ చేసినా.. అధికారపార్టీనుంచి అంతే వేగంగా కౌంటర్లొచ్చి పడుతున్నాయి. ముందు బీజేపీలో 15మంది ముదిరాజ్‌లకు అసెంబ్లీ సీట్లు ఇప్పించాక మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ నేతలు సవాల్‌ విసురుతున్నారు.

కాంగ్రెస్‌లో కొత్తగా కమ్మ సామాజికవర్గం మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. 10 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనతో కమ్మ సామాజికవర్గ పెద్దలు కాంగ్రెస్‌ హైకమాండ్‌ని కలిశారు. మిగతా సామాజికవర్గాలు పీసీసీ స్థాయిలో తమ విన్నపాలు చెప్పుకుంటే కమ్మ సంఘం నేతలు నేరుగా ఏఐసీసీ పెద్దలని కలిశారు. తెలంగాణలో 0.5 శాతం కూడా లేని కమ్మ సామాజికవర్గం 10 సీట్లు ఎలా అడుగుతుందని మిగిలిన సామాజికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వారే అన్ని అడుగుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన తమ సంగతేంటని మరికొన్ని సామాజికవర్గాల గొంతులు లేస్తున్నాయి.

కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి నాయకత్వం వహించడం కొసమెరుపు. సీట్లు ఇవ్వకపోతే తమ దగ్గర సెకండ్‌ ప్లాన్‌ ఉందని పార్టీ పెద్దలకు కమ్మ నేతలు అల్టిమేటమిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ కూడా కమ్మ వర్గానికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరుగురు కమ్మ నేతలకు టికెట్లిస్తే ఐదుగురు గెలిచారు.

అగ్రవర్ణాలే జనాభా ప్రాతిపదికన సీట్లు అడుగుతుంటే బలం, బలగం ఉన్న మేమేం తక్కువంటూ ఉప కులాలు కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని 40 నియోజకవర్గాల్లో తమ ప్రభావం ఉంటుందంటున్నారు కురుమలు. జనాభా దామాషా ప్రకారం 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ స్థానాలు, 2 ఎమ్మెల్సీ సీట్లు, చైర్మన్ పదవులు ఇవ్వాలని కురుమ పెద్దలు డిమాండ్ చేశారు. తమకు సీట్లిచ్చిన పార్టీలకు ఓట్లేయించే బాధ్యత తాము తీసుకుంటామని కులసంఘ పెద్దలు హామీ ఇస్తున్నారు. మరోవైపు పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు డిమాండ్ చేస్తోంది.

Share this post

submit to reddit
scroll to top