క్రికెట్‌కీ రాజకీయాలది వివాహేతర సంబంధంలాంటి బంధం. ఎందుకంటే క్రికెటర్లకు రాజకీయ భాష రాదు. క్రికెట్ సంఘాలకు అధ్యక్షులుగా వెళ్లే రాజకీయ నేతలకు బ్యాట్ ఎలా పట్టాలో, బాల్ ఎలా విసరాలో తెలీదు. కానీ క్రికెట్ అసోసియేషన్లలో ఖద్దర్ బ్యాచ్ తలేం ఖర్మం పడితే ఒళ్లంతా దూర్చేస్తుంటుంది. పనికిమాలిన రాజకీయాలను ఫేస్ చేయలేక జట్టులో క్లీన్‌బౌల్డ్ అయ్యాడో యువ క్రికెటర్. పేరు హనుమ విహారి. ఏడేళ్ల కెరీర్‌లో 16 టెస్ట్ మ్యాచ్‌లాడి ఆంధ్రా జట్టును రంజీల్లో ఐదుసార్లు నాకౌట్ దశను దాటించడంలో ఆ స్టార్ క్రికెటరే కీలకం. ఇన్నాళ్లూ అతడి కెరీర్ గురించే ఎవరయినా మాట్లాడుకునేవాళ్లు. కానీ ఇప్పుడతని వ్యక్తిత్వం మీద చర్చ మొదలైంది. చర్చ కాదు ఉద్దేశపూర్వకంగా రచ్చ జరుగుతోంది. సోషల్‌మీడియాలో హనుమ విహారి పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది.
బెంగాల్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న ఒక వ్యక్తిపై నేను కోప్పడ్డానంటూ అప్పటి అనుభవాన్ని పంచుకున్నాడు ఆ యువ క్రికెటర్. ఆటలో భాగంగానే హనుమ విహారి కాస్త కోప్పడ్డాడు. కానీ అవతలి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి కొడుకు. నాపైనే కోప్పడతావా అంటూ అతను పంతంపట్టాడు. అసోసియేషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, కనీసం సంజాయిషీ అయినా తీసుకోకుండా హనుమవిహారిని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది అంటూ హనుమ విహారి పోస్ట్ పెట్టాడు. ఈ పరిణామంతో నేను హర్ట్ అయ్యా.. ఇకమీదట జీవితంలో ఆంధ్రా జట్టు తరఫున ఆడను అంటూ హనుమవిహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రోహిత్‌రెడ్డి వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అల్లుడు. ప్రెసిడెంట్ శరత్‌చంద్రారెడ్డి కూడా ఆయనకు సోదరుడి వరస. ఇవ్నీ కలిసి ఏపీలో అధికార పార్టీని కార్నర్ చేశాయి. వైసీపీ నేతల కర్ర పెత్తనం వల్లే హనుమ విహారిపై వేటు పడిందని, రాష్ట్ర ప్రభుత్వ అరాచకం ఆటల్లోకి కూడా జొరబడిందని ఒక వర్గం మీడియాలో విశ్లేషణలొచ్చాయి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ చర్చ కాస్తా రచ్చ రచ్చవుతోంది. హనుమవిహారి అనుభవాన్ని షేర్ చేస్తూ వెరీ బ్యాడ్ అంటూ జనసేన ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.
హనుమ విహారి మందలించిన రంజీ ప్లేయర్ పేరు పృథ్వీరాజ్. తనపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో పృథ్వీరాజ్ కూడా స్పందించాడు. నాక్కూడా ఆట తర్వాతే మరేదైనా. క్రికెట్‌ని అమితంగా గౌరవిస్తా. అందరూ అనుకుంటున్నట్లు అక్కడేదీ జరగలేదు.. ఆరోజు గ్రౌండ్‌లో జరిగిందేంటో అక్కడున్నవాళ్లకే బాగా తెలుసు అంటూ రియాక్ట్ అయ్యాడు పృథ్వీరాజ్. ఛాంపియన్‌గా చెప్పుకుంటున్న నువ్వు ఇంతకంటే ఏమీ పీకలేవు అంటూ హనుమ విహారిని ఉద్దేశించి హార్ష్ కామెంట్ కూడా చేశాడు. పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి కూడా తన కొడుకుకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అసోసియేషన్‌లో నా జోక్యం ఉంటే నా కుమారుడు ఇంకా 17వ ఆటగాడిగానే ఎందుకు ఉండిపోతాడనేది ఆయన లేవనెత్తిన లాజిక్. త్వరలోనే హనుమ విహారి బండారమంతా బైట పెడతా అని హెచ్చరించారు పృథ్వీరాజ్ తండ్రి.
ఎవరివాదనలో ఎంత నిజమున్నా హనుమ విహారి ఎపిసోడ్ హెడ్‌లైన్ వార్తగా మారింది. రాజకీయ జోక్యంతో క్రికెట్ సంఘాలు భ్రష్టుపడుతున్నాయని, సత్తా ఉన్న క్రికెటర్ల భవిష్యత్తు బుగ్గిపాలవుతోందన్న వాదన వినిపిస్తోంది. హనుమ విహారికి వ్యతిరేకంగా కూడా వార్తలు మొదలయ్యాయి. గతంలోనే విహారిపై అనేక ఫిర్యాదులున్నాయని, అప్పట్లో టీమిండియాకు సెలెక్ట్ కాలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్‌ని ఆ క్రికెటర్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీద చూపిస్తున్నారని కథనాలొచ్చాయి. విహారి ఆరోపణలేవీ నిజం కాదు అంటూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. జంటిల్మెన్ గేమ్‌ని జగడాల్లోకి లాగడం భావ్యం కాదంటోంది ఏసీఏ. దీంతో భిన్నవాదనల మధ్య హనుమ విహారి హీరోనా విలనా అనే సందేహాలతో ఈ ఎపిసోడ్ ఇంకాస్త ఆసక్తికరంగా మారింది.
బాల్యం నుంచే అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడినప్పటికీ, 2017లో ఏపీకి వెళ్లి ఆంధ్రా జట్టు తరఫున రంజీల్లో ఆడారు హనుమ విహారి. తర్వాత ఇండియా జట్టుకు ఎంపికై తెలుగువారు గర్వపడే క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రా జట్టు తరఫున ఆడనని శపథం చేసేదాకా వెళ్లారంటే ఆయన మనోభావాలు అంతగా గాయపడేలా ఏం జరిగిందన్నదే ప్రశ్న. ఏమీ జరగకపోతే ఆయన అంతగా రియాక్ట్ అయ్యే అవసరం ఎందుకొస్తుందన్నది మరో వాదన. నిజంగానే రాజకీయ జోక్యం ఉందా.. లేకపోతే హనుమ విహారే ఎక్కువగా ప్రతిస్పందించారా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు సగటు తెలుగు క్రికెట్ అభిమాని.