చంద్రబాబుకి బిగ్‌ రిలీఫ్‌.. కండిషన్స్‌ అప్లై!

Capture.jpg

52రోజుల తర్వాత జైలుగోడల నుంచి బయటపడి బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆయన ఎన్నాళ్లు జైల్లోనే ఉంటారో, పార్టీ భవిష్యత్తు ఏమైపోతుందోనని దిగాలుపడ్డ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో కదంతొక్కారు. కంటి చికిత్సకోసం చంద్రబాబు అభ్యర్థనను మన్నించి నాలుగువారాల మధ్యంతర బెయిల్‌ని కోర్టు మంజూరుచేసింది. దాని ప్రకారం ఆయన మళ్లీ నవంబరు 28న మళ్లీ ఆయన రాజమండ్రి జైలులో సరెండర్‌ కావాల్సి ఉంటుంది.

జైలునుంచి బయటికి రాగానే చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మనవడు దేవాన్ష్‌ని ముద్దాడారు. బావమరిది బాలయ్యతో పాటు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో జైలు దగ్గరికి చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. తాను జైల్లో ఉండగా మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడూ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. తనకు సంఘీభావం ప్రకటించిన పార్టీలకు కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు అండగా నిలిచిన జనసేనకి, పవన్‌కల్యాణ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

మధ్యంతర బెయిల్‌లో మరో ఐదు నిబంధనలు చేర్చాలని సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్‌వేసింది. రాజకీయయాత్రలు చేయకూడదని, సభలు, ప్రసంగాలు పెట్టొద్దని కోరింది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని పిటిషన్‌లో పేర్కొంది. కేసు వివరాలను మీడియా, పబ్లిక్‌ ముందు మాట్లాడొద్దని, ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ ఆయన కదలికలను కోర్టుకు సమర్పించాలని సీఐడీ కోరింది. అయితే రేపటిదాకా ర్యాలీలో పాల్గొనకూడదని, మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు షరతులు విధించింది. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నిబంధనలు పెట్టింది. అయినా చంద్రబాబు బయటికొచ్చి మైకుపట్టటం షరతుల ఉల్లంఘనేనంటోంది వైసీపీ. దీన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు సీఐడీ న్యాయవాదులు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇన్నాళ్లుగా రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకి బెయిల్‌ వచ్చినా మరో కేసులో అరెస్ట్‌ చేస్తారని టీడీపీ అనుమానించింది. ఆయనకి బెయిల్‌ రావడానికి ముందురోజే మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అభియోగంతో సీఐడీ కేసు నమోదైంది. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్‌కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నాలుగువారాల మధ్యంతర బెయిల్‌ ముగిసేదాకా ఇతర ఏ కేసుల్లో కూడా ఆయన్ని అరెస్ట్‌ చేయబోమని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఈ నాలుగువారాల్లో చంద్రబాబు ఎన్నికల వ్యూహాలపై దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ జైలుకెళితే ఇప్పట్లో బెయిల్‌ వస్తుందో రాదో తెలీని పరిస్థితి ఉండటంతో.. జనసేన పొత్తు వ్యవహారంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కూడా ముందస్తు కసరత్తు జరిగే అవకాశాలున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మొదలుకాబోతోంది చంద్రబాబు మంత్రాంగం

Share this post

submit to reddit
scroll to top