ఇక తను లావణ్యత్రిపాఠి కాదు లావణ్య వరుణ్‌తేజ్. మెగాఫ్యామిలీలో కొత్త మెంబర్. ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే ది బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా పేరున్న ఇటలీలోని టస్కనీ ఈ సెలబ్రిటీ జంట మాంగల్యబంధానికి వేదికైంది.
ఇద్దరూ సిల్వర్ స్క్రీన్‌మీద పాపులర్ సెలబ్రిటీలే. 2017లో మొదటిసారి ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. అప్పట్నించే మంచి ఫ్రెండ్స్‌గా మారారు. 2018లో వచ్చిన ‘అంతరిక్షం’ సిన్మాలోనూ ఈ జంట కలిసి నటించింది. ఇద్దరి మధ్య స్నేహం కొన్ని నెలలుగా ప్రేమగా మారింది. పోయినేడాది డిసెంబరులో లావణ్య బర్త్‌డే సందర్భంగా లవ్ ప్రపోజల్ ఆమె ముందు పెట్టాడు నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్. కుర్రోడికి ఏం తక్కువని. లావణ్యత్రిపాఠి ఒప్పేసుకుంది. రెండు కుటుంబాలూ వీరి ప్రేమ వివాహానికి ఆహ్వానం పలికాయి. బాగా దగ్గరివారైన కొంతమంది సమక్షంలో అలా జరిగిపోయింది వరుణ్‌తేజ్-లావణ్యల వివాహం.
లావణ్యత్రిపాఠికి వరుణ్‌తేజ్ చెల్లెలు నిహారిక క్లోజ్‌ఫ్రెండ్. ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు షికార్లు చేశారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక పెళ్లికి కూడా హాజరైంది లావణ్యత్రిపాఠి. లావణ్య నార్త్ అమ్మాయి. కానీ చిలకపలుకుల్లా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. గతంలో అన్యాపదేశంగా అల్లు అరవింద్ ఓ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలైపో అని సరదాగా వ్యాఖ్యానించారు. చివరికి అదే జరిగింది. ఆ తెలుగబ్బాయి అల్లు అరవింద్ బావమరిది కొడుకే కావడం యాదృచ్ఛికమైనా ఆయన దీవెన ఇలా ఫలించింది.
జూన్‌లోనే వరుణ్‌తేజ్-లావణ్యల నిశ్చితార్థం జరిగింది. ఇటలీ టస్కనీలో ఆత్మీయబంధువుల మధ్య గ్రాండ్‌గా జరిగింది వీరి పెళ్లి. పెళ్లికి ఈ జంట సంప్రదాయబద్ధంగా ముస్తాబైంది. లావణ్య ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తే.. వరుణ్ తేజ్ ఐవరీ రంగు ధోతీ- షేర్వాణిలో రాయల్ లుక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీల జంట పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చూసినవాళ్లంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు.