ఒసేయ్‌ బంగారం.. చెప్పనా!

gold-demand.jpg

బంగారమంటే భారతీయ సమాజంలో ఓ సెంటిమెంట్. ఒకప్పుడు అలంకారం, ఆడంబరం అనుకున్నది నేడు అవసర వస్తువుగా మారింది. కొందరికైతే అది స్టేటస్ సింబల్‌. బంగారం ఉంటే అదో నిశ్చింత. భవిష్యత్తుకు, అత్యవసరాలకు అదో భరోసా. బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు. దీంతో బంగారానికి డిమాండ్‌ పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన పరిస్థితులు లేవు. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా పరుగులు పెడుతోంది పుత్తడి.

స్టాక్ మార్కెట్లతో పోటీ పడి పరుగులు పెడుతోంది బంగారం ధర. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ లక్ష దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి 70వేల మార్కును తాకింది. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే..బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడెందుకో దానికి భిన్నంగా ఉంది. స్టాక్‌ మార్కెట్లతో పోటీ పడి బంగారం రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్టాక్స్‌ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా. ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో మరో 12 నుంచి 15 శాతం మేర పెరుగుదల ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ​ఉన్నా మనదగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. అంతర్జాతీయ దిగుమతులే మనకు ఆధారం. అంతర్జాతీయ సమాజంలో అనిశ్చితులే పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మధ్య ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ వైఖరితోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. ముఖ్యంగా చైనా నుంచి పసిడికి గిరాకీ ఎక్కువగా ఉండడం కూడా ధరలకు పగ్గాలు లేకపోవడానికి ఓ కారణంగా భావిస్తున్నారు.

వేసవిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న వారు బంగారం ధరలు చూసి కంగారు పడుతున్నారు. భారతీయుల పెళ్లిళ్లలో బంగారం ముఖ్యమైన భాగం కావడంతో ధర ఎంతైనా కొనక తప్పని పరిస్థితి. తగ్గుతుందని చూస్తూ కూర్చుంటే ఇంకా పెరుగుతుందోమోనన్న భయం వారిని వెంటాడుతోంది. బంగారం రేటు అందనంత ఎత్తుకు వెళ్తుందన్న అంచనాతో కొనుగోళ్ళకు మొగ్గు చూపుతున్నారు. గత పదేళ్లలో బంగారంపై పెట్టుబడి పెట్టినవాళ్లు భారీగానే లాభపడ్డారు. 2013లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి దాదాపు 29వేల దగ్గర ట్రేడ్‌ అయింది. ప్రస్తుతం అది 70 వేలకు చేరింది.

 

Share this post

submit to reddit
scroll to top