రెండు చోట్లా ఓట్లు.. ఎందుకీ ఫీట్లు!

voter-File-Image.jpg

ఓటు ఎన్ని చోట్ల ఉండొచ్చు. ఒకే మనిషి ఎన్ని రాష్ట్రాల్లో ఓటేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిపైనే డిబేట్‌ నడుస్తోంది. ఒక మనిషికి ఒకే చోట ఓటుహక్కు ఉంటుంది. అందులో అనుమానమేం లేదు. కానీ కొన్ని దశాబ్దాలుగా రెండు రాష్ట్రాలు రెండు ఓట్ల ట్రెండ్‌ నడుస్తోంది. తెలంగాణలో కొన్నిచోట్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. రాష్ట్రం విడిపోకముందు సొంత ప్రాంతంలోనే సీమాంధ్రుల ఓట్లు ఉండేవి. ఎన్నికలొస్తే సొంత ప్రాంతాలకు వెళ్లి ఓటేసి వచ్చే ఒరవడి కొనసాగేది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. అయితే సీమాంధ్రలో, లేకపోతే తెలంగాణలో ఒకే చోట ఓటు ఉండాలి. కానీ కొందరికి రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. రెండుచోట్లా ఓట్లేస్తున్నారు. వందలూ వేలు కాదు రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నవారు లక్షలసంఖ్యలో ఉన్నారు. ఈ ట్రెండ్‌ తెలుగురాష్ట్రాలకే పరిమితం కాలేదు. బెంగళూరులాంటి చోట, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి ఇలాగే రెండు చోట్లా ఓట్లున్నాయి. మిగతా రాష్ట్రాల సంగతెలా ఉన్నా రెండు చోట్ల ఓట్లపై వైసీపీ ఇప్పుడు గట్టిగానే గురిపెట్టింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరుగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నికలకు కనీసం ఐదారు నెలల గ్యాప్ ఉంటోంది. దీంతో రెండుచోట్లా ఓట్లున్నవారు ఇక్కడా ఉంటాం అక్కడా వేస్తాం అంటున్నారు. రెండు ఓట్లను వదులుకోడానికి చాలామంది ఇష్టపడడం లేదు. పైగా ఎన్నికలంటేనే డబ్బు. ఓటరు లిస్టులో పేరుంటే చాలు పోలింగ్‌కి రెండ్రోజుల ముందే చార్జీలు, దారిఖర్చులు కూడా చేతుల్లో పెడుతున్నారు. ఓటుకు హీనపక్షం రెండు వేలు వేసుకున్నా ఇంటికి నాలుగు ఓట్లుంటే 8వేలు వచ్చినట్లే. పైగా కొంతమందికి రెండుపార్టీలనుంచి కూడా ఇలాంటి ఆఫరుంటోంది. దీంతో చార్జీలు పోయినా దండగ లేదన్నట్లు ఎన్నికల పండుగకి సకుటుంబ సమేతంగా వెళ్లొస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాల్లో నిరసనలు జరిగాయి. రెండు చోట్లా ఓట్లున్న ఔత్సాహికులే వీటిలో ముందున్నారని వైసీపీ అనుమానిస్తోంది. అందుకే ఎక్కడ స్థిరపడితే అక్కడే ఓటుండేలా చూడాలంటోంది. హైదరాబాద్, బెంగళూరులో స్థిరపడ్డ సీమాంధ్రుల ఓట్లు తీసేయాలని వైసీపీ కోరుకుంటోంది. అలాంటివారి ఓట్లు దాదాపు 60 లక్షలు ఉన్నాయన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. అయితే తమ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్ల ద్వారా బీఎల్‌ఓలకు సమాచారం ఇచ్చి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న టీడీపీ మద్దతుదారుల ఓట్లు తీసేయించే కుట్ర చేస్తున్నారని విపక్షపార్టీ ఆరోపణలు చేస్తోంది.

నిజానికి సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఓట్లున్న వాళ్లు చాలా నియోజకవర్గాలను శాసిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కనీసం 40 నుంచి 45 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఉంది. తెలంగాణలోని పార్టీలు ఈ ఓట్లను ఉంచాలని కోరవు, తీసేయాలవి కోరుకోవు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను బట్టి, ఒక పార్టీ మరోపార్టీకి ఇచ్చే మద్దతును బట్టి వీళ్ల ఓట్లు టర్న్ అవుతుంటాయి. ఎవరు సీమాంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకుంటే వారికే ఓట్లు పడతాయి. అందుకే ఈ వ్యవహారంతో తెలంగాణలో రాజకీయ పార్టీలకు వచ్చిన ఇబ్బందేం లేదు. కానీ ఏపీలో మాత్రం ఈ డబుల్‌ ఓటింగ్‌ వద్దే వద్దంటోంది వైసీపీ. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో దృష్టిసారిస్తే మాత్రం అయితే సొంత ప్రాంతంలోనో, లేదంటే సెటిలై అయిన చోటో ఏదో ఒక చోటుకే ఓటేయాల్సిన పరిస్థితి వస్తుంది.

Share this post

submit to reddit
scroll to top