రష్యా-ఉక్రెయిన్ మంట చల్లారనే లేదు. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలీదు. మంటలు ఆర్పాల్సిన పెద్దన్న ఇంకాస్త ఆజ్యంపోస్తున్నాడు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై బైడెన్ కొత్త లాజిక్ చెప్పారు. మూడు ఖండాలకు దీన్ని ముడిపెట్టారు. అనేక దేశాల అధినేతలు ఇజ్రాయిల్-హమాస్ వార్‌పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రష్యా తన బద్ధ శత్రువైన అమెరికాపై నింద మోపింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా విధానాల వైఫల్యమే ఈ యుద్ధానికి కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజుల క్రితం విమర్శించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదానికి భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ కారణం అయ్యుండొచ్చన్నది బైడెన్ అంచనా. దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి రుజువులు లేవంటూ ఇది తన ఊహ మాత్రమేనని అమెరికన్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ మరింత బలంగా అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని బైడన్ చెబుతున్నారు. అయితే కారిడార్ పనిని మాత్రం వదిలిపెట్టం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్‌ను ప్రతిష్టాత్మక జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కారిడార్ ముంబై నుంచి ప్రారంభమవుతోంది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కి ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ కారిడార్ పొడవు 6 వేల కిలోమీటర్లు.. అందులో 3500 కిలోమీటర్ల సముద్ర మార్గం ఉంది. దీని నిర్మాణం పూర్తయితే భారత్ నుంచి యూరప్‌కు వస్తువుల రవాణాలో దాదాపు 40శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం కార్గో షిప్ జర్మనీకి చేరుకోవడానికి 36 రోజులు పడుతోంది. ఈ కారిడార్‌లో వెళ్తే 14 రోజులు ఆదా అవుతాయి. దీంతో ఎగుమతి-దిగుమతులు సులభంగా, చౌకగా జరుగుతాయి.
జి20 సమ్మిట్ సందర్భంగా భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ కారిడార్ ఏర్పాటు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టుతో ఆసియా, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది రెండు వేర్వేరు కారిడార్‌లను కలిగి ఉంటుంది. తూర్పు కారిడార్ భారతదేశాన్ని మిడిల్ ఈస్ట్‌కు కలుపుతుంది. ఉత్తర కారిడార్ మిడిల్ ఈస్ట్‌ను యూరప్‌కు కలుపుతుంది. ఈ కారిడార్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ రెండు ఖండాలలో పెట్టుబడుల అవకాశాలు పెంచుతుందన్నారు. దీన్ని దెబ్బతీసేందుకే హమాస్ యుద్ధం మొదలుపెట్టి ఉండొచ్చంటున్నారు బైడెన్. ఏమో.. పెద్దన్న డౌటే నిజమేమో!