మనసువిప్పి మాట్లాడాం..
ఇదీ అల్లు అరవింద్ మాట
స్టార్ ప్రొడ్యూసర్, టాలీవుడ్ టీమ్ మనసు విప్పి మాట్లాడింది మరెవరితోనే కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమ పవర్‌స్టార్‌తో. ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారారు సినీ హీరో. దీంతో ఏపీలో టాలీవుడ్‌కి మంచి రోజులకొచ్చాయని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో సినిమాటోగ్రఫీ శాఖను కూడా పవన్‌పార్టీకే చెందిన దుర్గేష్‌కి ఇచ్చారు. దీంతో ఏపీలో సినీపరిశ్రమను ప్రోత్సహించేలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం పవర్‌స్టార్ చేతుల్లోనే ఉంది.
సువిశాల సముద్రతీరంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అందమైన షూటింగ్ స్పాట్‌లు ఉన్నాయి అద్భుతమైన లోకేషన్లు చాలా ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని సినీ ప్రముఖులకు ఏపీ మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. మద్రాస్ నుంచి తరలివచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో సెటిలయ్యేందుకు సుదీర్ఘకాలం పట్టింది. దశాబ్ధాల క్రితమే నటసామ్రాట్ అక్కినేని అన్నపూర్ణ స్టూడియో కట్టి మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలిచారు. తర్వాత రామానాయుడు , ఎన్టీఆర్, కృష్ణ స్టూడియోలు నిర్మించారు. అప్పటి ప్రభుత్వాలు ప్రకటించిన రాయితీలతో భాగ్యనగరంలో సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌కు తిరుగు లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చిత్ర పరిశ్రమ కూడా ఏపీకి తరలివెళ్లాలని ప్రతిపాదనలు వచ్చాయి. నిజానికి టాలీవుడ్‌కు సగానికి పైగా ఆదాయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచే వస్తోంది. విశాఖలో ఇప్పటికే రామానాయుడు స్టూడియో ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తరలించి అమరావతిలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు కూడా గతంలో వచ్చాయి. విభజన సమయంలో చాలామంది సినీ పెద్దలు, ఆ పరిశ్రమతో అనుబంధమున్న నాయకులు దీని గురించి మాట్లాడినా పదేళ్లలో ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.
విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినీ పరిశ్రమ విస్తరించాలనే ఆకాంక్ష అక్కడి ప్రజల్లో ఉంది. ఏపీలో దశాబ్దాలుగా సిన్మా షూటింగులు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీ ఎంతోకొంత వచ్చి సెటిలవ్వడానికి అవసరమైన హంగులు మాత్రం ఇంతవరకు సమకూరలేదు. వైజాగ్‌లో రామానాయుడు స్టూడియో కట్టినా అక్కడ షూటింగులు, ప్రొడక్షన్ పనులు తక్కువే. మౌలిక సదుపాయాలు లేక ఏపీలో సినీ నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణలో ఉన్న ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో లేవు.
కేరళ మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లు ఏర్పాటు చేసి షూటింగ్‌లకు ఇస్తే పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. విశాఖ, తిరుపతి, అరకు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ అతిథి గృహాలను నామమాత్రపు రుసుముతో కేటాయిస్తే ఇండస్ట్రీని ప్రోత్సహించినట్లు అవుతుందంటున్నారు చిన్న నిర్మాతలు. ఏపీలో నంది అవార్డుల మాటమరిచి ఎనిమిదేళ్లయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో మళ్లీ ఆ అవార్డులు ప్రకటిస్తారనే ఆశాభావంతో ఉంది టాలీవుడ్ పరిశ్రమ.
ఏపీ అభివృద్ధి పట్టాలెక్కాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. సిన్మా ఇండస్ట్రీ కూడా అందులో భాగమే. టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సిన్మా పరిశ్రమను ఆకర్షించలేకపోతే రాష్ట్రం కేవలం షూటింగ్ స్పాట్‌గానే మిగిలిపోతుంది. బాధ్యతలు స్వీకరించిన వారంలోపే పవర్‌స్టార్ చూపించిన చొరవతో టాలీవుడ్‌కి ఏపీ కేరాఫ్‌గా మారుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.