తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల పంచాయితీలు నడుస్తున్నాయి. ఎప్పుడూ లేంది ఇప్పుడు ఎంఐఎంలో కూడా ధిక్కారస్వరాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఒవైసీ బ్రదర్స్ చెప్పిందానికి తలూపే నాయకులు ఈసారి అడ్డం తిరిగేలా ఉన్నారు. ఓల్డ్‌సిటీలోని ఏడు సిట్టింగ్ సీట్లు మజ్లిస్‌పార్టీ అడ్డాలు. ఎవరిని నిలబెట్టినా ఓ వర్గం ఓట్లు సాలీడ్‌గా పడతాయి. ఈసారి ఆ ఏడుతో పాటు మరికొన్ని సీట్లలో కూడా పోటీకి ఎంఐఎం సిద్ధమవుతోంది. అదే సమయంలో కొందరు సిట్టింగ్ అభ్యర్థులను మార్చాలనుకుంటోంది.
చార్మినార్, యాకుత్‌పురా, నాంపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఎంఐఎం భావిస్తోంది. వీటిలో చార్మినార్ సీటుపై పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ 1994 నుంచి యాకుత్‌పురాలో వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ 2018లో ఆయన్ని చార్మినార్ నుంచి బరిలోకి దించారు. యాకుత్‌పురాలో వ్యతిరేకతతోపాటు కొన్ని ఆరోపణలు రావటంతో అహ్మద్‌ఖాన్ సీటు మార్చారు. చార్మినార్‌లో కూడా ఆయన భారీ మెజార్టీతో గెలిచారు.
యాకుత్‌పురా నియోజకవర్గంలో ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తొలిసారి ఎంబీటీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన ఎంఐఎంలో చేరారు. 2018లో ఆయనకు చార్మినార్ కేటాయించడంతో అక్కడి ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి యాకుత్‌పురా నుంచి విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో ఆయన్ని కూడా పక్కన పెట్టాలని ఎంఐఎం నిర్ణయించింది. చార్మినార్‌నుంచి తప్పుకోవాలని ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌కి ఎంఐఎం నచ్చజెబుతోంది. అయితే అహ్మద్‌ఖాన్ ససేమిరా అనడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. తనకు కాదంటే తన కుటుంబంలోని మరొకరికి టికెట్ ఇవ్వాలని అహ్మద్‌ఖాన్ పట్టుబడుతున్నారు.
నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేని యాకుత్‌పురాకి మార్చి నాంపల్లి, చార్మినార్‌లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని ఎంఐఎం భావిస్తోంది. మిగిలిన సీట్లలో పెద్దగా సమస్యల లేకపోయినా చార్మినార్ స్థానంలో మాత్రం అహ్మద్‌ఖాన్ అడ్డం తిరిగారు. అయితే ఒవైసీ బ్రదర్స్ మాటే ఫైనల్ కావటంతో కాదూ కూడదంటే పక్కనపెట్టేందుకే అవకాశాలు ఉన్నాయి.