అసలే ఎన్నికలకాలం. వర్షాకాలంలో ఉరుములు మెరుపుల్లా ఊహించని వరదల్లా ఎన్నో వార్తలు మెరుస్తుంటాయ్. పారుతుంటాయ్. పార్టీ అధినేత స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇరుక్కుని జైల్లో పడటంతో టీడీపీ ఇంకా షాక్‌నుంచి కోలుకోలేదు. ఆయనెప్పుడు బయటికివస్తారో, వచ్చినా ఎన్నాళ్లు తిరగనిస్తారో తెలీదన్నట్లుంది సిట్యువేషన్. ఒకటికి నాలుగుకేసులు పీకకి చుట్టుకునేలా ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్తేంటని చిన్నాచితకా పెద్దాముతకా నాయకులంతా టెన్షన్‌పడుతుంటే.. ఆ పార్టీవాళ్లే నమ్మలేని సర్వే ఒకటి వచ్చిపడింది. సీ ఓటర్ అనీ ఓ సంస్థ చేసిన సర్వేగా అది చెలామణి అవుతోంది.
ఏతావాతా ఆ సర్వే చెప్పొచ్చేదేంటంటే అరెస్ట్ తర్వాత చంద్రబాబుకి సింపథీ విపరీతంగా పెరిగిపోయిందట. ఆ సానుభూతి ఓట్లరూపంలో కలిసొస్తుందా.. ఏ పార్టీ ఓటర్లు ఏమనుకుంటున్నారన్నది ఆ సర్వే వార్తాంశం. చంద్రబాబుని అరెస్ట్ చేయడం చివరికి వైసీపీకి మద్దతిచ్చేవారికి కూడా నచ్చలేదన్న పాయింట్ కూడా అందులో ఉంది. అనవసరంగా చంద్రబాబుని జగన్మోహన్‌రెడ్డి గెలిపించేలా ఉన్నారన్న ఆందోళన కూడా వైసీపీ వర్గాల్లో ఉందట. మొత్తానికి ఆ సర్వేని బేస్ చేసుకుని ఇచ్చిన న్యూస్ చూస్తుంటే.. ఈ అరెస్ట్‌తో చంద్రబాబు నెత్తిన జగన్మోహన్‌రెడ్డే చిక్కటి పాలు పోసినట్లయింది.
వైసీపీ ఆడిపోసుకునే ఎల్లోమీడియాకి ఈ సర్వే ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. ఇంకేముందీ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా మిగిలిన పసుపు మాధ్యమాలు (Yellow Media) భవిష్యత్ ఫలితాల్ని ఊహించేసి ఊదరగొట్టేశాయి. నిజంగానే అరెస్ట్ టీడీపీకి లాభించేలా ఉంటే.. చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేలా ఉంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నట్లు? కోట్లు ఖర్చుపెట్టి లాయర్లెందుకూ క్వాష్ పిటిషననీ, ముందస్తుబెయిలనీ, రిమాండ్‌వద్దనీ ఈ న్యాయపోరాటాలెందుకు? డెంగ్యూతో ఓ ఖైదీ చనిపోవటంతో దోమలు చంపేస్తాయని భయపడుతున్నారు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన తనయుడు భయపెడుతున్నారు. అసెంబ్లీలో బామ్మర్ది మీసాలు తిప్పుతున్నారు. అంటే ఆ సర్వే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికేనా? దానికి ప్రామాణికతేమీ లేదా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది?
ఎన్ని శాంపిళ్లు తీసుకున్నారు? ఏయేవర్గాల ఎన్నెన్ని అభిప్రాయాలు సేకరించారు? అవేమీ లేవు. కొద్దోగొప్పో గుర్తింపు ఉన్న సీ ఓటర్ ఆగమేఘాలమీద చంద్రబాబు అరెస్ట్‌మీద సర్వే చేయడమే విచిత్రంగా ఉంది. దారినపోయే దానయ్యలని పలకరించి వారి అభిప్రాయమే సర్వజనాభిప్రాయమంటే నమ్మబుల్ కాదు. టీడీపీ శ్రేణులు చెప్పుకోడానికి, ప్రచారం చేసుకోడానికే తప్ప ఆ సర్వే జనాభిప్రాయమని రుద్దేస్తే ఎలా? ఓపక్క అరెస్ట్‌కి భయపడే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మార్గదర్శి చిట్స్ చీటింగ్‌లో రామోజీరావుని కూడా అరెస్ట్ చేయొచ్చన్న వెర్షన్ వినిపిస్తోంది. నిజంగానే చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి వచ్చేస్తే.. వైసీపీకి ప్రతికూలత పెరిగితే ఇవన్నీ జరిగే ఛాన్సేలేదు.