అనుకున్నామని జరగవు అన్నీ..

jagan-sixer.jpg

అవును.. అనుకోలేదని ఆగవు కొన్ని. కానీ జరిగేవన్నీ మంచికనుకుంటే అది రాజకీయం ఎందుకవుతుంది. అందుకే ఎగ్జిట్‌పోల్స్‌ రాగానే నేతలు ఉలిక్కిపడుతున్నారు. భుజాలు తడుముకుంటున్నారు. కౌంటింగ్‌కి మూడ్రోజులముందు ఫలితాలతో ఏపీ రాజకీయం ఇంకాస్త వేడెక్కింది. మరీ ముఖ్యంగా వాస్తవ ఫలితాలకు దగ్గరదగ్గరగా అంచనాలుండే ఆరా మస్తాన్‌ సర్వేతో టీడీపీ, దాని మిత్రపక్షపార్టీలు ఉడుక్కుంటున్నాయి. నూటపాతిక సీట్లకు తగ్గవని హైప్‌ సృష్టిస్తే తుస్సుమని గాలితీసేస్తావా అంటూ ఆరా సర్వేపై గుర్రుమంటున్నాయి. కానీ వైసీపీలో కీలకమైన నాయకులు, మంత్రులు కూడా ఓడిపోతారని ఆరా సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌ ఉన్నదున్నట్లు చెబుతున్నాయి.

వైనాట్‌ వన్‌ సెవంటీ పైవ్‌ అన్నంత ఏకపక్షంగానైతే ఏపీ ఎన్నికలు జరగలేదన్నది సుస్పష్టం. పోలింగ్‌ రోజే ఏ పార్టీ అయినా వందదాటడం కష్టమనుకున్నారు. ఇప్పుడు ఆరా మస్తాన్‌ సర్వే అయినా మరో సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌ అయినా గెలిచే పార్టీకి వందా నూటపది మధ్యే వస్తాయన్న అంచనాకొచ్చాయ్‌. ఆరా సర్వే ప్రకారం.. వైసీపీ 94-104 అసెంబ్లీ స్థానాల్లో గెలవనుంది. టీడీపీ కూటమి 71-81 స్థానాలకే పరిమితం కానుంది. మరికొన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీ కూటమి అధికారంలోకొస్తుందని తేల్చేశాయి.

పార్థా దాస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 110 నుంచి 120 సీట్లు, టీడీపీ కూటమికి 55-65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సీపీఎస్‌ అంచనాల ప్రకారం వైసీపీ 97-108 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుంది. పొలిటికల్‌ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ వైసీపీకి 108 సీట్లు వస్తాయంటోంది. ఆ సంస్థ సర్వే ప్రకారం కూటమి 67 అసెంబ్లీ సీట్లకే పరిమితమవుతుంది. వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చింది. ఆ సంస్థ అంచనాల ప్రకారం కూటమికి 59 నుంచి 77 దాకా సీట్లు దక్కే అవకాశం ఉంది. జన్‌మత్‌ అనే సంస్థ వైసీపీకి 95-103 సీట్లు, టీడీపీ కూటమికి 67-75 సీట్లొస్తాయని అంచనావేసింది.

రాప్‌ స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌పోల్స్‌ అయితే విపక్ష కూటమికి షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి. ఆ సంస్థ అంచనాల ప్రకారం వైసీపీకి ఏకంగా 158 అసెంబ్లీ సీట్లు వస్తాయి. స్మార్ట్‌ పోల్ అంచనాల ప్రకారం వైసీపీకి 80 స్థానాలు వస్తాయి. కూటమికి 93 సీట్లు వస్తాయంటోంది ఆ సర్వే సంస్థ. రెంటికీ 8సీట్లు ప్లస్‌ మైనస్‌ కావచ్చన్నది ఆ సంస్థ అంచనాతో. చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ విపక్షకూటమిదే అధికారమంటున్నాయి. ఆ సంస్థ అంచనాల ప్రకారం టీడీపీ 114-125 సీట్లు సాధిస్తుంది. వైసీపీ 39-49 సీట్లకి పరిమితమవుతుంది.

Share this post

submit to reddit
scroll to top