పొత్తు ధర్మమే కాదు
ఏ ధర్మమూ పాటించని వాడే “బాబు”
తెలుసుకో తమ్ముడూ పవన్ కళ్యాణ్!
జనసేన అధినేతపై విరుచుకుపడే వైసీపీ బృందంలో ఒకడైన అంబటి రాంబాబు ట్వీట్ ఇది. తమ్ముడూ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూనే బీ వేర్ ఆఫ్ బాబు అని సందేశమిచ్చారు వైసీపీ మంత్రి. బ్రో సిన్మాలో తనను ఇమిటేట్ చేసినా, సంబరాల రాంబాబు అని గేలిచేసినా పవన్‌కల్యాణ్‌కి మాత్రం అంబటి జ్ఞానబోధ చేస్తున్నారు. జనసేన పొత్తుతో పాటు బీజేపీని కూడా కలుపుకుని ఏపీలో వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబునాయుడిని నమ్మొద్దని చెబుతున్నారు. చంద్రబాబు-పవన్‌కల్యాణ్ మధ్య చిన్నగ్యాప్ రాగానే మధ్యలో దూరిపోవడం లేదు వైసీపీ. పవన్‌కల్యాణ్ అసహనం ప్రదర్శించాక, టీడీపీతో సంబంధం లేకుండా రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశాక రాజకీయంగా ఎవరయినా మాట్లాడతారు. మాట్లాడకపోతేనే ఆశ్చర్యం!
చంద్రబాబు రాజకీయం ఎప్పుడూ అలాగే ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా ధర్మపోరాటాలు చేసింది ఆయనే. మళ్లీ మోడీషా ప్రాపకం కోసం పాకులాడుతున్నది కూడా ఆయనే. ఎవరికివారు పోటీచేస్తే ఓట్లు చీలి అంతిమంగా వైసీపీ లాభపడుతుందనే జనసేన పొత్తుకు ముందుకొచ్చింది. బీజేపీని కూడా పొత్తుకి ఒప్పించే ప్రయత్నాల్లో ఉంది. నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఊపిరినిలిపే చెక్కబల్లలా దొరికారు పవన్‌కల్యాణ్. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో పడ్డప్పుడే అర్ధమైపోయింది టీడీపీ పరిస్థితేంటో. లోకేష్‌ని ఎవరూ దేకలేదు. ఈ దెబ్బతో సైకిల్‌ని ఏ పార్టుకి ఆ పార్టు విడదీసి అటకమీద పెట్టేసే పరిస్థితి వస్తుందనుకున్నారు. అప్పుడు మద్దతుగా నిలిచిన పవన్‌కల్యాణ్ ఆ పార్టీకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. బాబు జైల్లో ఉన్నప్పుడే సీట్ల బేరసారాలు తెగ్గొట్టాల్సింది. అప్పుడే లిస్టుపై సంతకం పెట్టించి కమిట్ చేయించాల్సింది. బాగోదు.. బయటికొచ్చాక మాట్లాడుకుందామనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.
టీడీపీతో పొత్తు చారిత్రక అవసరమని పవన్‌కల్యాణ్ నెత్తీనోరు బాదుకుంటుంటే చంద్రబాబుకేమో ఆ పార్టీ కరివేపాకులా కనిపిస్తోంది. చేతిలో ఉండి కూరలో వేస్తే ఓకే. వేయకపోయినా టేస్ట్ పెద్దగా మారదన్నట్లే ఉంది చంద్రబాబు, లోకేష్‌ల తీరు. నాలుగు అటో ఇటో ఎవరెక్కడ పోటీచేయాలో ఈపాటికి తేల్చేసి ఉండాలి. కొన్ని సీట్లలో ఇబ్బందులుంటే వాటివరకు పక్కనపెట్టి మిగిలిన సీట్లపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చుండాలి. కానీ జనసేనకు పాతికిస్తేనే ఎక్కువ అన్నట్టుంది టీడీపీ వరస. రెండుమూడు అటో ఇటో ముఫ్పైలోపే పరిమితం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ చేగొండి హరిరామ జోగయ్యలాంటి పెద్దమనుషులు ముందునుంచే మొత్తుకుంటున్నారు. చంద్రబాబుని గుడ్డిగా నమ్మేస్తే అంతేసంగతులని పవన్‌కల్యాణ్‌ని అప్రమత్తంచేస్తూ వస్తున్నారు. సీట్ల సంగతి తేల్చకుండా రా కదలిరా అంటూ జనంలోకెళ్లి అభ్యర్థులను ప్రకటిస్తే పవన్‌కల్యాణ్‌కి కాలదా? ఏం.. తను మాత్రం ఉప్పూకారం తినడంలేదా?
నోటికొచ్చినట్లు తిట్టలేదనేగానీ బాబు అండ్ కోకి గట్టిగానే గడ్డిపెట్టారు పవన్‌కల్యాణ్. పాదయాత్ర ముగింపుసభలో నారా లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలని కూడా గుర్తుచేశారు. విడిగా పోటీచేస్తే సీట్లొస్తాయి. కానీ అధికారంలోకి రాలేము. అందుకే సర్దుకుపోతున్నానని చెప్పారు. ఒత్తిడి మీకేనా.. నాకు మాత్రం ఉండదా అంటూ రాజోలు, రాజానగరం సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించేశారు. ఇది చంద్రబాబు స్వయంకృతమే. అభ్యర్థుల విషయంలో చివరిదాకా సాగదీయడం ఆయనకు అలవాటే. ఓపక్క వైసీపీ ఇంచార్జిలను మార్చేస్తోంది. దీంతో అధికారపార్టీలో అసమ్మతి నేతలంతా పొలోమని టీడీపీలోకి వస్తే రెడీమేడ్‌గా అభ్యర్థులు దొరుకుతారన్న దురాలోచన. కానీ జనసేన సీట్ల విషయం తేల్చాకే ముందుకెళ్లాలన్న ఇంగితం లోపించింది. మూడోవంతు సీట్లు తీసుకుంటామని ఇప్పుడు పవన్‌కల్యాణ్ చెప్పేసరికి టీడీపీ అధినేత గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. మూడోవంతు అంటే దగ్గరదగ్గర 60 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
60 సీట్లలో జనసేనకు సమర్ధులైన అభ్యర్థులున్నారో లేదో వేరే విషయం. ఇంతదూరం వచ్చాక పవన్‌కల్యాణ్ రాజీపడితే పరువుపోతుంది. చేగొండిలాంటి తలపండిన నేతలు మేం అప్పుడే చెప్పామని మొట్టికాయలు వేస్తారు. ఊగిసలాటలో ఉన్న ముద్రగడ లాంటి నేతలు గుమ్మం బయటే ఆగిపోతారు. నాయకుడన్నాక రాజకీయం చేయాల్సిందే. కానీ చంద్రబాబు గాలిబదులు రాజకీయాన్నే పీల్చి బతుకుతాననే రకం. 52 రోజుల జైలు అనుభవంలోనూ ఆయనకు ఏదీ శాశ్వతం కాదన్న జ్ఞానోదయం అయినట్లు లేదు. ఓపక్క కష్టమైనా నిష్టూరమైనా వైసీపీ అధినేత అభ్యర్థులను మార్చేస్తున్నారు. అనుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. కానీ టీడీపీ మితిమీరిన జాగ్రత్తలతో కొంప కొల్లేరయ్యేలా ఉంది. జైల్లో ఉన్నప్పుడు పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చిన జనసేనాని మీకిది ధర్మమా అని ప్రశ్నించారంటే టీడీపీ నైతికంగా బోనులో నిలబడ్డట్టే!
కడుపులో దాచుకోలేక నాలుగు మాటలన్నా పొత్తుకే కట్టుబడి ఉంటానంటున్నారు పవన్‌కల్యాణ్. దీంతో ఊపిరిపీల్చుకున్న చంద్రబాబు అండ్ కో తొందరగా సీట్ల లెక్క తేల్చాలనుకుంటోంది. ఈలోపు బాబునొదిలేయ్ మనం మనంచూసుకుందామని బీజేపీ లైన్‌లోకొస్తే అంతే సంగతులు. ఎందుకంటే చంద్రబాబుతో కలిసి పనిచేయడం కమలం పార్టీకి ఇష్టంలేదు. బీజేపీది అవకాశవాద రాజకీయమే అయినా ఆ విషయంలో దానికంటే నాలుగాకులు ఎక్కువే చదివారు చంద్రబాబు. అయితే ఆయన ఆడించినట్లు ఆడటానికి పవన్‌కల్యాణ్ సిద్ధంగా లేరని అర్ధమైపోయింది. ఇరవయ్యో పాతికో ఇచ్చి మమ అనిపిద్దామంటే ఇక కుదరదు. 60 కాకపోయినా కనీసం 50అయినా ఇవ్వాల్సిందే. దాంతో పాటు అధికారంలోకొస్తే పదవుల విషయం కూడా ముందు తేల్చాల్సిందే. ఇన్నాళ్లూ విషయాన్ని నాన్చినందుకు చక్రవడ్డీతో కలిపి కట్టబోతున్నారు చంద్రబాబు. కట్టే ముచ్చటే లేదంటే రిస్క్‌కి రెడీ కావాల్సిందే.