ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు!

bjp-success-mantra.jpg

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహకందని నిర్ణయాలు తీసుకుంది. మూడు రాష్ట్రాల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక సమతూకాన్ని పాటించింది. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నేతలను కూడా పక్కనపెట్టింది. ఆర్నెల్లలోపే పార్లమెంట్‌ ఎన్నికలు ఉండటంతో ఎవరి అంచనాలకు అందని నిర్ణయాలతో కొత్తవారిని సీఎం కుర్చీల్లో కూర్చోబెట్టింది కమలంపార్టీ.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా సామాజిక సమీకరణాలతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మని సీఎంని చేస్తారని ఎవరూ ఊహించలేదు. పార్టీ పెద్దలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేసులో లేనని మాజీ ముఖ్యమంత్రి వసుంధరారాజే ముందే ప్రకటించారు. 56 ఏళ్ల భజన్‌లాల్‌శర్మ మొదట్లో ఏబీవీపీలో పనిచేశారు. మోడీకి సన్నిహితుడిగా పేరున్న శర్మ మూడు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనవర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ. రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన సీఎంని అందించిన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌తోనే కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ పేరును ప్రతిపాదించేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కాదని కొత్త మొహాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏ నాయకుడి పేరునూ ఎన్నికల ముందు ప్రకటించలేదు. మూడు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన బలమైన నేతలున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా కొత్తవారికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించింది. ఓ చోట గిరిజన నేతను, మరోచోట బలహీనవర్గాల నాయకుడిని అందలమెక్కించిన బీజేపీ, రాజస్థాన్‌లో మాత్రం ఓసీ నాయకుడిని సీఎంని చేసి బ్యాలెన్స్‌ చేసింది. ఏ రోటికాడ ఏ పాటపాడాలో బీజేపీకి తెలిసినంతగా మరే పార్టీకి తెలీదు.

Share this post

submit to reddit
scroll to top