ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఫలితాలొచ్చాక ఓటమికి వీరినే బాధ్యులను చేస్తున్నారు ఐదేళ్లు అధికారాన్ని అనుభవించినవారు. అంత కీలక పాత్ర పోషించిన వారంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వ కరుణాకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. తొందరపడి రాజీనామాలు చేసినవారు తమ తప్పుకాయమంటున్నారు. ఏపీ రాజకీయాల్ని అప్పుడూ ఇప్పుడూ కుదిపేస్తోంది వాలంటీర్ల వ్యవస్థ.
వైసీపీ అధికారంలో ఉండగా వాలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పోయినేడాది ఏలూరు సభలో వాలంటీర్ల వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వాలంటీర్లు సేకరించే సమాచారం సంఘ విద్రోహశక్తుల చేతిలోకి వెళ్లే ప్రమాదముందని ఆరోపించారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే సమస్యలేదుగానీ.. రాజకీయాలు చేయటం సరికాదని చంద్రబాబు గతంలో హితవు పలికారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నారా లోకేష్. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతూ వైసీపీ కోసం పనిచేస్తున్నారనేది అప్పటి ప్రతిపక్షాల ఆరోపణ.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విచిత్రంగా వైసీపీ నాయకులకు కూడా వాలంటీర్లే టార్గెట్ అయ్యారు. ఏపీలో వైసీపీ ఓటమికి వాలంటీర్లు కూడా ఒక కారణమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిందించారు. వాళ్ల వల్లే నాయకులకు, ప్రజలకు మధ్య దూరం పెరిగిందనేది మాజీ మంత్రి వాదన. మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ఓటమికి ఓ కారణమని చెప్పుకొచ్చారు. ఇక మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మరో అడుగుముందుకేసి అధినేతను తప్పుపట్టారు. వాలంటీర్లు, ఐప్యాక్ టీమ్‌ని చూసుకుని వైసీపీ అధినేత జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకున్నారని ఆరోపించారు ఆ మాజీ మంత్రి.
వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారని ఎన్నికల ముందు టీడీపీ ఆరోపిస్తే.. తమ పరాజయానికి వాలంటీర్ల వ్యవస్థను ఓ కారణంగా చెబుతున్నారు వైసీపీ నాయకులు. పార్టీల గెలుపోటములకు వాలంటీర్లు ఎంత వరకు బాధ్యులో ఎవరూ తేల్చలేరు. కానీ ఆ వ్యవస్థలో భాగమైనందుకు రెండువైపులా నిందలు మోయాల్సి వచ్చింది మాత్రం వాలంటీర్లే. ఆరోపణలు, విమర్శలు పక్కనపెడితే ఇప్పుడు వారికి ఉద్యోగభద్రత సమస్యగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తక్కువ వేతనానికే పనిభారాన్ని నెత్తినెత్తుకున్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చారు. నెలకు 5వేల గౌరవవేతనంతో 2019 ఆగస్టులో ఏపీ ప్రభుత్వం 2లక్షల 66వేలమంది వాలంటీర్లను నియమించింది. ఇది సేవాభావంతో చేసే పననీ, దీన్ని సర్కారు కొలువుగా చూడొద్దని అప్పట్లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించలేదు. అదే సమయంలో కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం కొందరిని విధుల నుంచి తప్పించింది. మరికొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పని మానేసిన వాలంటీర్లంతా ఆందోళన చెందుతున్నారు. తమను నిర్బంధంగా తప్పించినవారిపై మండిపడుతున్నారు. కొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించటంతో పాటు వారి గౌరవ వేతనం 5 నుంచి పదివేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడా మాటను నిలబెట్టుకుంటారని వాలంటీర్లు దీనంగా ఎదురు చూస్తున్నారు. రాజీనామాలు చేయని లక్ష పైచిలుకు వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగిస్తుందా.. ఇంకేమన్నా మార్పులుచేర్పులు చేస్తుందా అన్నది చూడాలి. పాత వాలంటీర్లలో 80 శాతంమంది వైసీపీ వారేనన్న ఆరోపణలుండటంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రజలకు చేరువై నాయకులకు దూరమైన వాలంటీర్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోందో మరి!