కృత్రిమ మేథ కొంప‌ముంచ‌బోతోంది!

ai-automation.jpg

ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. AIతో మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంత‌కంటే ఎక్కువే జరుగుతోంది. ఇంకా మున్ముందు మ‌రిన్నికొంప‌లు ముంచేలా ఉంది. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ఓవైపు చాట్‌ జీపీటీ లాంటి అద్భుతాలు జరుగుతుంటే…మరోవైపు డీప్‌ ఫేక్‌ వీడియోలు ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగిస్తున్నాయి. AIతో రాబోయే రోజుల్లో సామాన్యుడి జేబుకు చిల్లు పడబోతోందా? అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతే ఉద్యోగ భద్రత సంగతి ఏంట‌న్న చ‌ర్చ మొద‌లైంది. 2025 నాటికి 50 శాతం పనులు ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జ‌రిగిపోతే .. ఉద్యోగాలు కూడా అదే స్థాయిలో ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

మానవజాతి చరిత్రలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలు వచ్చినప్పుడల్లా కొన్ని వృత్తులు, ఉద్యోగాలు మాయమైపోయాయి. కొత్త టెక్నాల‌జీ వచ్చినప్పుడలా ఉద్యోగ భద్రతపై ఆందోళన కలుగుతూనే ఉంది. అయితే గ‌తం సంగ‌తేమోగానీ రాబోయేది మాత్రం నెక్ట్స్‌ లెవెల్ అంటూ సాంకేతిక నిపుణులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నారు. ఒక్క చిటికె వేస్తే చాలు…ఆర్టీఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌తో రకరకాల పనులు చేసి పెట్టే చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ లాంటి కృత్రిమ మేధస్సుల సాంకేతికత ఇప్పుడు ఉద్యోగ‌వ‌ర్గాల్లో భయాలను రెట్టింపు చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంట‌లిజెన్స్‌తో జాబ్‌ మార్కెట్‌లో అల్లకల్లోలం తప్పద‌ని విశ్లేషిస్తున్నారు టెక్నిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. రాబోయే కాలంలో ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్ వల్ల ప్రపంచ శ్రామిక శక్తిలో 25శాతం ఆటోమేషన్‌కు దారితీస్తుందని గోల్‌మాన్ సాచ్స్ గతంలో అంచనా వేసింది. అయితే తాజాగా మెకిన్సే విశ్లేషణ ప్రకారం 2025 నాటికి ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ద్వారా దాదాపు 50శాతం పని జరుగుతుందని టెక్ క్రంచ్ చెబుతోంది. ఇక మ‌రికొన్నిఅంచ‌నాల్లో ఒక్క చాట్ జీపీటీనే దాదాపు 80శాతం ప్రభావితం చేయగలదని అంచ‌నా వేస్తున్నారు.

ఉద్యోగాలను ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్ భర్తీ చేయగలదా, అలాంటి పనులను ఆటోమేట్ చేయడం ఆర్థికంగా సాధ్యమేనా అనేదానిపై మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధనలు చేసింది. అయితే ఈ అధ్యయనంలో అమెరికాలో కార్మికులకు సంబంధించి కేవ‌లం 1.6 శాతం మాత్రమే AI ద్వారా ఆటోమేషన్ కుదురుతుందని తేలింది. మొత్తం పనుల్లో 0.4 శాతం మాత్రమే ఆటోమేట్ చేయడానికి వీల‌వుతుంద‌ని ఆ అధ్య‌య‌నం చెబుతోంది. అయితే మొత్తంమీద ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌తో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం గణనీయంగా ఉంటుందని ఆ పరిశోధనలు తేల్చ‌టంతో జాబ్‌ మార్కెట్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంట‌లిజెన్స్ అన్ని రంగాల్లో సమూల మార్పులను తెచ్చే శక్తి ఉన్న టెక్నాలజీ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. ఏఐతో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నా, స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఉద్యోగులు ఆ ప్రమాదాన్ని కొంతవరకు అధిగమించవచ్చ‌ని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

Share this post

submit to reddit
scroll to top