కంటైనర్‌ లోగుట్టు సీబీఐకే ఎరుక!

visakha-drugs.jpg

బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు దిగుమతైన 25 టన్నుల డ్రైఈస్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. డ్రై ఈస్ట్ మాటున పెద్ద ఎత్తున కొకైన్ తరలించారన్నది సీబీఐ అధికారుల సందేహం. ఆపరేషన్ గరుడ పేరుతో భారీ డ్రగ్ డంప్‌ని గుర్తించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తంలో రిపీటెడ్‌గా వినిపిస్తున్న పదం డ్రై ఈస్ట్. ఏమిటది? ఎక్కడో బ్రెజిల్‌ నుంచి తెప్పించాల్సిన అవసరమేంటన్నదే చర్చనీయాంశం.

బ్రెజిల్ నుంచి సంధ్యా ఎక్స్‌పోర్టర్స్ దిగుమతి చేసుకున్న 25 టన్నుల డ్రై ఈస్ట్‌ను ఆసాంతం పరీక్షిస్తున్నారు సీబీఐ అధికారులు. ఫోరెన్సిక్‌ టీమ్‌ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించింది. డ్రైఈస్ట్‌ నుంచి రొయ్యల మేతను ఉత్పత్తి చేయాలనుకున్నాం.. ఆ బ్యాగుల్లో డ్రగ్స్ విషయం మాకు తెలీదంటూనే సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తోంది సంధ్యా ఎక్స్‌పోర్ట్స్.

డ్రైఈస్ట్‌ అంటే మిగిలిపోయిన చెత్త… కుళ్లిన పదార్థాల అవశేషం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఆ పదార్థం సూక్ష్మక్రిముల సముదాయం. బాగా కుళ్లిన పండ్లు, మిగిలిపోయిన ఆహార పదార్ధాలను ఉచితంగా సేకరించి, దీన్ని ప్రాసెసింగ్ ద్వారా డ్రైఈస్ట్‌గా మలచి చౌక ధరకు అమ్మేయడం యూరప్ దేశాల్లో ఒక ఖరీదైన వ్యాపారమార్గం. ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌ని మన దగ్గర పశువులు, చేపలు, రొయ్యల మేతకు ఉపయోగిస్తారు.

ప్రొటీన్లు, సీ విటమిన్లు, భాస్వరం, అమినో ఆమ్లాలు విరివిగా ఉండే డ్రైఈస్ట్‌ను కాసింత చక్కెర కలిపి ఆల్కహాల్ తయారీలో కూడా వాడతారు. బేవరేజ్ కంపెనీలు కూడా యూరోపియన్‌ కంట్రీస్ నుంచి డ్రైఈస్ట్‌ దిగుమతి చేసుకుంటాయి. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం చేరుకున్న పాతిక టన్నుల ఇనాక్టివ్ డ్రైఈస్ట్ కూడా అలాంటిదే. అక్వా లాంటి వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమల్లో ఉపయోగపడే ప్రాడక్ట్ కావటంతో వీటి దిగుమతిపై కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్ నిఘా పెద్దగా ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్ రాకెట్ నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

చేపలు-రొయ్యల మేతకు ఉపయోగపడే డ్రైఈస్ట్‌ని మత్తెక్కించే డ్రగ్స్‌గా మార్చే ప్రక్రియ జరుగుతోందన్నదే సీబీఐ అనుమానం. డ్రైఈస్ట్‌కి కాస్త చక్కెర కలిపితే ఆల్కహాల్‌గా, కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. మరికొన్ని ఇన్‌గ్రేడియంట్స్ చేర్చి.. డ్రైఈస్ట్‌ని మత్తుపదార్థంగా కూడా తయారు చెయ్యవచ్చట. ప్రస్తుతానికి విశాఖలో పట్టుబడ్డ భారీ డ్రగ్ కంటైనర్‌పై విచారణ జరుపుతోంది సీబీఐ బృందం. కొన్ని బ్యాగుల్లో తెల్లటి పేస్ట్‌లాంటి పదార్థం కనిపించిందని,ఇది కొకైన్ అని ప్రాథమిక పరీక్షలో తేలిందని సీబీఐ చెబుతోంది.

డ్రగ్ డిటెక్షన్ టెస్టుల్లో డ్రై ఈస్ట్ కాదు డ్రగ్‌ పేస్టేనని రుజువైతే బ్రెజిల్ టు ఏపీ వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ మాఫియా నడుస్తోందన్న ఆరోపణ నిజమవుతుంది. కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే అయితే నాలుగురోజుల రాజకీయ వివాదంగా కథ ముగిసిపోతుంది.

Share this post

submit to reddit
scroll to top