ఒక దేశం ఒకే ఎన్నిక. పాత చరిత్రను మార్చేయాలనుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనల్లో ఇదొకటి. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనపై కసరత్తు కూడా మొదలైంది. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఏర్పాటైన కోవింద్ కమిటీ అధికారికంగా భేటీ అయింది. ఢిల్లీ జోధ్‌పూర్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, గులామ్ నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి హాజరయ్యారు.
జమిలి ఎన్నికలకు సంబంధించి సలహాలివ్వడానికి రాజకీయపక్షాలు అపాయింట్‌మెంట్ కోరితే వెంటనే ఇవ్వాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది. ఎలక్షన్ కమిషన్, న్యాయ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలనుంచి కూడా ఈ కమిటీ సూచనలు తీసుకోనుంది. కమిటీ పనితీరు ఎలా ఉండాలి? వన్‌నేషన్-వన్ ఎలక్షన్ ఆలోచనపై ఏకాభిప్రాయం ఎలా తీసుకురావాలి.. హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు, అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎలా వ్యవహరించాలి లాంటి అంశాలపై ప్రాథమికంగా కోవింద్ కమిటీ ఓ అంచనాకు వచ్చింది.
జమిలి ఎన్నికలు హాంఫట్ అన్నట్లు జరిగిపోవు. దానికి చాలా తతంగం ఉంటుంది. ఒక నిర్ణయానికి రావాలంటే కనీసం రెండుమూడేళ్లయినా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నివేదిక సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కాలపరిమితి ఇవ్వకపోవటంతో కమిటీ కూడా తొందరపడదల్చుకోవడం లేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలికి సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారని ఊహాగానాలొచ్చాయి. కానీ కోవింద్ కమిటీ నివేదిక వచ్చేదాకా అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. సో.. ఈసారికి అలాంటిదేమీ లేనట్లే. 2029 నాటికి మహిళారిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభనతో పాటు జమిలి ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాల్సి వచ్చేలా ఉంది.