యవ్వనంలోకి మిలీయనీర్‌!

Brian-johnson-california.jpg

ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటుంటారు. కానీ ఇది పిచ్చికాదు. ప్రయోగం. అవును.. కాలగర్భంలో ఒక్క క్షణాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకురాలేం. వయసు కూడా అంతే. బాల్యం, యవ్వనం, నడియవయసు, వృద్ధాప్యం.. ఇలా జీవనచక్రం నడవాల్సిందే. పూటపూటా కంచెం చూసుకునే పేదోడినుంచి వేలకోట్లకు పడగెత్తిన సంపన్నులదాకా ఎవరికైనా ఈ దశలు అనివార్యం. మహాఅయితే ఉన్నోడు మంచి ఆహారం, విరామం, ప్రత్యేకజాగ్రత్తలతో కొత్త నోటులా కాస్త తళతళలాడొచ్చేమో అంతే.

రివర్స్‌ ఏజింగ్‌. వయసుని వెనక్కి మళ్లించొచ్చా అంటే బాహ్యరూపంలో కొంత వయసును తగ్గించొచ్చు. తగ్గించినట్లు అందరికీ కనిపించొచ్చు. ఎంత సంపాదించినా మూటగట్టుకుని పోయేదేముందని కొందరు అనుకుంటారు. వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలని ఆశపడుతుంటారు. అమెరికాలో ఓ వ్యక్తి దీనికోసం పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. తన వయసుని తగ్గించుకునేందుకు (అలా కనిపించేందుకు) ఎన్నో పాట్లు పడుతున్నాడు. ఆ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఏడాదికి అక్షరాలా 16కోట్లు ఖర్చుపెడుతున్నాడు. రోజుకు అతను 111 టాబ్లెట్లు (విటమిన్‌ సప్లిమెంట్స్‌) వేసుకుంటున్నాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ తన యవ్వన లక్ష్యంకోసం ఆస్తులు కరిగిపోయినా ఫర్లేదనుకుంటున్నాడు. 45 ఏళ్ల బ్రియాన్‌ జాన్సన్‌ 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు ఓ డాక్టర్ల బృందాన్ని ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ప్రస్తుతం కొడుకికి అన్నలా కనిపిస్తున్నాడు. అయినా అతనికి తృప్తిలేదు. కొడుకుని జనం తన అన్న అనుకునేంతగా మారిపోవాలని బ్రియాన్ జాన్సన్ ఆరాటపడుతున్నాడు. తన లక్ష్యంకోసం బ్రెయిన్ ట్రీ కంపెనీని 800 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. 30 మంది వైద్యుల బృందంతో రెండేళ్లుగా ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో రివర్స్ ఏజింగ్‌కి అన్ని ప్రయత్నాలుచేస్తున్నాడు. ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే వయసు తగ్గడమే కాదు.. తనకు చావే రాదన్న ధీమాతో ఉన్నాడు జాన్సన్‌.

Share this post

submit to reddit
scroll to top