అధికారంలో ఉండేది ఆర్నెల్లేనట!

revanth-swering.jpg

పదేళ్ల అధికారం దూరమయ్యేసరికి బీఆర్‌ఎస్‌ భరించలేకపోతోంది. తనకు చెందాల్సిన విజయం కాంగ్రెస్‌కి దక్కిందన్న ఉక్రోషంతో బీజేపీ రగిలిపోతోంది. ఇక రేవంత్‌రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్‌ టిల్లూ అంటూ విమర్శించిన బీఆర్‌ఎస్‌ బెస్ట్‌ఫ్రెండ్‌ ఎంఐఎం అహనంతో రగిలిపోతోంది. కాంగ్రెస్‌ విజయాన్ని కల్లో కూడా ఊహించని ఈ పార్టీలు అప్పుడే విషం కక్కుతున్నాయి. పదేళ్లు జనరంజకంగా పాలించాననుకుంటున్న బీఆర్‌ఎస్‌.. తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. 64 సీట్లు గెల్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌పై అప్పుడే కొందరు విషం చిమ్ముతున్నారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్‌ సర్కార్‌ ఎక్కువ కాలం నిలబడదని శాపనార్థాలు పెడుతున్నారు.

సీనియర్‌ నేత కడియం శ్రీహరి పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పడితే చాలంటున్నారు. అదేంటీ ఐదేళ్ల తర్వాత కదా ఎన్నికలొచ్చేది. కానీ ఏడాదిలోపే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కడియం సెలవిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేకతలోనూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి గెలిచారు. ఆయన అంచనా ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసైనా మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందట. బీఆర్‌ఎస్‌కు 39 సీట్లు వచ్చాయి. ఏడు సీట్లు గెలిచిన మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఎలాగూ ఉంది. అయినా 46 సీట్లు దాటవే. మరో 8 సీట్లున్న బీజేపీని కూడా అవసరమైతే కలుపుకుంటామంటున్నారు కడియం శ్రీహరి. అయినా యాభై నాలుగే. మరెలాగంటే కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారా పెద్దమనిషి. మరి ఆయన బుర్రలో పుట్టిన ఆలోచనో, కేసీఆర్‌ పార్టీలో అలాగే మిగిలినవాళ్లు కూడా ఆలోచిస్తున్నారో?

ఇక మత విద్వేష వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ నేత రాజాసింగ్‌ కూడా అప్పుడు అపశకునాలు పలుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అంటున్నారు గోషామహల్‌నుంచి మరోసారి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఆయన అంచనాల ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల అమలు తలకు మించిన భారమవుతుంది. కేసీఆర్‌ తెచ్చిన అప్పులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్డీలు కూడా కట్టలేదంటున్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని రాజాసింగ్‌ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ని ఓడించడమే లక్ష్యంగా పనిచేసి తెలంగాణలో సెల్ఫ్‌గోల్‌ చేసుకుంది బీజేపీ. కాస్త స్వతంత్రంగా వ్యవహరించి ప్రజల్లో ఇంకాస్త నమ్మకం కలిగించి ఉంటే ఆ పార్టీనే కచ్చితంగా కింగ్‌మేకర్‌ అయ్యుండేది. 8 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఒక్కటే తెలంగాణలో సమర్ధమైన పాలన అందించగలదన్నది రాజాసింగ్‌ మాట. అదెలా సాధ్యమో విడమర్చి చెప్పలేదుగానీ ఆయనకు కూడా కడియం శ్రీహరి తరహా ఆలోచనే ఉన్నట్టుంది.

కేసీఆర్‌ తర్వాత పట్టాభిషేకం జరుగుతుందనుకుంటే ప్రజాతీర్పుతో కేటీఆర్‌ కలలు కల్లలైపోయాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమంటూనే ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంటున్నారు కేటీఆర్‌. అయితే ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందని కేటీఆర్‌ అంటున్నారు. స్వల్పకాలమంటే ఐదేళ్లు ఉండదనా? 60నెలలు అధికారంలో ఉండనివ్వమనా? బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇది కూడా ఓ కారణం. ఎంఐఎం కనుసన్నల్లో నడుచుకునే పాతబస్తీ కూడా ఇప్పుడు ఎదురుతిరిగి ప్రశ్నిస్తోంది. ఈటల, బండి సంజయ్‌, ధర్మిపురి అర్వింద్‌లాంటి నేతలు కూడా ఓడిపోవడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ప్రజాతీర్పుని గౌరవించి తమ లోటుపాట్లు సరిచేసుకోవాల్సిన సమయంలో ఆ పార్టీలన్నీ ఒక్కటైతే తమ భవిష్యత్తుకు తామే గొయ్యి తీసుకున్నట్లే!

Share this post

submit to reddit
scroll to top