అడ్డుపడటానికి సైంధవులెవరూ లేరు. క్రెడిట్ ఎవరికి దక్కుతుందన్న అసూయాద్వేషాలు లేవు. స్వతంత్ర భారతచరిత్రలో ఈసారి ఆ అవకాశాన్ని ఎవరూ చేజారనివ్వలేదు. మహిళా బిల్లుపై చొరవచూపిన ఎన్డీఏకి రాజకీయ ఎజెండా ఉండొచ్చు. తన రెండు పర్యాయాల యూపీఏ పాలనలో పట్టాలెక్కించలేకపోయిన కాంగ్రెస్‌కి దాని కారణాలు దానికుండొచ్చు. కానీ ఈసారి మాత్రం మహిళాలోకం కల నీరుగారకుండా చూసింది ప్రజాస్వామ్యసౌధం. పార్టీలకతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. గడపదాకా వచ్చి నిరాశతో వెనుదిరుగుతూ వచ్చిన మహిళాసాధికారిత ఈసారి సగర్వంగా తలెత్తుకుంది.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో పార్టీలకతీతంగా భారీ మద్దతు లభించింది. సుమారు 11 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత గురువారం రాత్రి బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ఓటూ పడలేదు. ఆడవాళ్లకి పెత్తనమిచ్చేదేంటని కొన్ని కురచబుద్ధులకు లోపల వ్యతిరేకత ఉందేమోకానీ దాన్ని బయటపెట్టే సాహసం ఈసారి ఎవరూ చేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతిచ్చినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహించారు. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందినట్లు ఓటింగ్ రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభలో ఓటింగ్ సమయంలో సభలోనే ఉన్న ప్రధాని బిల్లు ఆమోదంతో ఆనందం వ్యక్తంచేశారు.
మహిళా రిజర్వేషన్‌బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు కొందరు ఇది ఎన్నికల జిమ్మిక్కని విమర్శలుచేసినా ఓటింగ్‌లో మాత్రం అంతా మద్దతిచ్చారు. బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో తదుపరి ప్రక్రియ మొదలుకావాల్సి వచ్చింది. ఇక్కడే పాలకుల చిత్తశుద్ధి బయటపడబోతోంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారితే 2024 ఎన్నికల తర్వాత జన గణన, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. ఆ తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానుంది. రిజర్వేషన్ ఫలాలు అందుకునేందుకు మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చినా పాతికేళ్లుగా నిరీక్షిస్తున్న మహిళాలోకానికి ఇదేం పెద్ద సమయంకాదు. భవిష్యత్తు చట్టసభల్లో మూడొంతులమంది మహిళలను చూడబోతున్నాం. మకుటం లేని మహరాణులకు జేజేలు!