బీఆర్‌ఎస్‌కి ఓటమి భయం పట్టుకుందా? ఆ ఆందోళనతోనే ప్రచారంలో సెల్ఫ్‌గోల్స్ చేసుకుంటోందా? తెలంగాణ సెంటిమెంట్ మూడోసారి గట్టెక్కించేలా లేదని అర్ధమైందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు బీఆర్‌ఎస్ అగ్రనేతలే అవకాశం ఇస్తున్నారు. ఆర్నెల్లక్రితం బీజేపీతోనే ప్రధాన పోటీ అనుకున్నారు. కానీ సీన్ మారిపోయింది. బీఆర్‌ఎస్‌ని గద్దె దించుతానని కాంగ్రెస్ తొడగొడుతోంది. బీజేపీ ఎందుకు ఒక్కసారిగా బలహీనపడిందంటే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలెలా ఉన్నాయో.. కమలం వడలిపోవడానికి కూడా అలాంటి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అంతలా ఎందుకు పుంజుకుందీ అంటే పదేళ్లు అవకాశం ఇచ్చాం.. ఇక చాలనుకునేవారికి ఆ పార్టీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్ చేసుకుంటున్న సెల్ఫ్‌గోల్స్ విషయానికొస్తే అసలే నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ నియామకాలు అనుకున్నస్థాయిలో జరగలేదు. పైగా పేపర్ల లీకేజీలు నిరుద్యోగులను బాగా కుంగదీశాయి. ఎన్నికల ముందు ప్రవళ్లిక అనే ఓ యువతి ఆత్మహత్య తెలంగాణ యువతను కుదిపేసింది. ఆమె ఆత్మహత్యపై కేటీఆర్ తొందరపాటు వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ని ఇంకాస్త సంకటంలో పడేశాయి. ప్రేమ వ్యవహారమే ఆ అమ్మాయి ఆత్మహత్యకు కారణమని, అసలామె గ్రూప్స్‌కి దరఖాస్తే చేసుకోలేదన్న ఖండనలాంటి వివరణతో తప్పులో కాలేశారు కేటీఆర్. ఇది విపక్షాలకు చేజేతులా అందించిన ఓ ఆయుధం.
హైదరాబాద్‌కు వచ్చే కంపెనీని కాంగ్రెస్ కర్నాటకు తరలించాలనుకుంటోందని మరో ఆరోపణ చేసి ఆత్మరక్షణలో పడ్డారు కేటీఆర్. ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్‌లో కాదు, బెంగుళూరులో పెట్టాలని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ లేఖరాశారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌కి ఓటేయాలా అని ప్రశ్నించారు. దీంతో వెంటనే డీకే వివరణ ఇచ్చారు. ఆ లేఖ ఫేక్ అని తేల్చేయటమే కాదు దీనిపై సైబర్ క్రైమ్‌లో కేసు కూడా పెట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ పొరపాటునో గ్రహపాటునో అధికారంలోకొస్తే తెలంగాణకు నష్టమని చెప్పే ప్రయత్నంలో జరిగిందీ ఫేక్ ప్రచారం.
మొన్నీమధ్య దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిమీద హత్యాయత్నం విషయంలోనూ కేటీఆర్ తొందరపడ్డారు. ఆ సంఘటన జరిగిన కాసేపటికే దాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డిలాంటి థర్డ్ రేట్ క్రిమినల్స్ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చివరికి ఆయన వాదన తేలిపోయింది. ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుక రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. కేవలం సంచలనం కోసమే ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని చెప్పటంతో బీఆర్‌ఎస్ నేతల గొంతు పెగల్లేదు. ఎన్నికల సమయంలో ప్రతీ మాటా ఆచితూచి పలకాల్సింది పోయి బట్టకాల్చి మొహాన వేస్తే రివర్స్‌లో మసి అంటుతోంది.
కర్నాటకలో కాంగ్రెస్ పాలన బాలేదంటూ అక్కడి రైతులొచ్చి ప్రచారం చేయడం కూడా కృతకంగా ఉంది. సమస్యలుండొచ్చు. కానీ పనిగట్టుకుని, చార్జీలు పెట్టుకుని ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానం ప్రజలకొచ్చింది. చివరికి రేవంత్‌రెడ్డి ఓటుకునోటు కేసుని గుర్తుకు చేస్తున్నా ఎవరూ నమ్మడంలేదు. బలమైన ఆధారాలుంటే ఎందుకు ఇన్నాళ్లూ అరెస్ట్ చేయలేదన్న ప్రశ్న వస్తోంది. ఇక బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమైతే దేశమంతా కుదిపేస్తుందని అనుకున్నారు. కానీ కొన్నాళ్లకే అది తెరమరుగైపోయింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కొంత అనివార్యమైతే బీఆర్‌ఎస్ తన తప్పిదాలతో ఇంకాస్త కోరితెచ్చుకుంటోంది