కాంగ్రెస్‌-ఎంఐఎం మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతాయా?

revanth-with-akbaruddin.jpg

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ సెగ‌లు పుట్టించిన కాంగ్రెస్‌- ఎంఐఎం పార్టీల నేతలు క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అన్న‌ట్లున్నారు. దీంతో కాంగ్రెస్‌- ఎంఐఎం మధ్య మ‌ళ్లీ పాత పొత్తు కొత్తగా పొడిచిందా అన్న చర్చ మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా.. అన్నట్టూ కాంగ్రెస్‌- ఎంఐఎం నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎలాగైనా కాంగ్రెస్‌ని దెబ్బకొట్టాలనే ఎంఐఎం మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒంటికాలిపై లేచారు. దాదాపు 80 వేల ముస్లింల ఓట్లున్న గోషామహల్‌లో ఎందుకు పోటీ చేయడంలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ టిల్లు చెబితే తాము పోటీ చేయాలా అని రేవంత్‌రెడ్డికి కౌంటరిచ్చారు.

ఎంఐఎంకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రొటెం స్పీకర్‌ ఆఫర్‌ చేయడంపై వివాదం చెల‌రేగింది. ఆయ‌న‌తో ప్ర‌మాణ‌స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్ట‌ప‌డ‌లేదు. స్పీక‌ర్ ఎన్నిక త‌ర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు. తుమ్మితే ఊడేలా ఉన్న ముక్కును కాపాడుకునేందుకే మ‌జ్లిస్‌పార్టీని కాంగ్రెస్ దువ్వుతోంద‌ని కిష‌న్‌రెడ్డి లాంటి నేత‌లు ఆరోపించారు. వీటిని కాంగ్రెస్ లైట్ తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సమస్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షలో ఆయ‌న ప‌క్క‌నే క‌నిపించారు అక్బ‌రుద్దీన్‌. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమన్న చర్చ సాగుతోంది.

పదేళ్లుగా బీఆర్ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. బీఆర్ఎస్‌ అధికారం కోల్పోవడంతో ఎంఐఎం నేతలు కూడా గులాబీపార్టీకి హ్యాండ్ ఇస్తార‌న్న ప్రచారం జరుగుతోంది. 64 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చినా గ్రేట‌ర్ ప‌రిధిలో కాంగ్రెస్ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. హైద‌రాబాద్‌లో బ‌ల‌ప‌డేందుకు, ప్ర‌భుత్వం స్థిరంగా సాగేందుకు ఎంఐఎం మ‌ద్ద‌తు కీల‌క‌మ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వీలైనంత‌వ‌ర‌కు మ‌జ్లిస్‌పార్టీతో వివాదాలు లేకుండా ముందుకెళ్లాల‌న్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. ప్రొటెం స్పీక‌ర్‌గా పెద్ద‌పీట వేయ‌డం, సిటీ స‌మ‌స్య‌ల‌పై స‌మీక్ష‌లాంటివి దానికి సంకేతాలు. ఎంఐఎం కూడా కొరివితో త‌ల‌గోక్కునేందుకు సిద్ధంగా లేదు. అందుకే కాంగ్రెస్‌తో స్నేహ‌పూర్వ‌కంగా మ‌స‌లుకునే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి.

Share this post

submit to reddit
scroll to top