ఆ ఓట్ల‌లో ఎన్ని ఒరిజ‌న‌ల్‌.. ఎన్ని డూప్లికేట్‌?

voterlist.jpg

ఏవి అస‌లు ఓట్లు. ఏవి న‌కిలీ ఓట్లు. ఏపీలో దీనిపైనే ఇప్పుడు రాజ‌కీయ‌ప‌క్షాలు కీచులాడుకుంటున్నాయి . ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే ప‌లుమార్లు ఎలక్షన్ కమిషన్‌ గడప తొక్కిన పార్టీలు పోటీలు ప‌డి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీలు ఈసీకి ఫిర్యాదులు ఇచ్చాయి. లక్షల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందంటూ వైసీపీ ఎంపీలు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.

ఏపీలో టీడీపీ నేతలు 40.76 లక్షల ఓట్లను న‌మోదు చేయించార‌న్న‌ది వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓట‌ర్ల‌ను నమోదు చేసినట్లు ఈసీకి అధికార‌పార్టీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఉంటున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్ల‌ని ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మై పార్టీ డాష్ బోర్డ్ యాప్ ద్వారా టీడీపీ ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందన్న‌ది వైసీపీ ప్రధాన ఆరోప‌ణ‌. ఈ డేటాను న్యూయార్క్ సర్వర్‌లో భద్రపరుస్తున్నార‌ని వైసీపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

మ‌రోవైపు వైసీపీ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తోంద‌ని టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారారని ప్ర‌తిప‌క్ష‌పార్టీ ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. టీడీపీ-వైసీపీ మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు న‌డుస్తుండ‌గానే బీజేపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓట్ల అక్రమాలకు సంబందించిన ఆధారాలను పెన్‌ డ్రైవ్‌లో ఈసీకి స‌మ‌ర్పించారు బీజేపీ నేత‌లు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. మూడు పార్టీల పోటాపోటీ ఫిర్యాదులు ఏపీలో పొలిటికల్‌ హీట్ పుట్టిస్తున్నాయి. పార్టీల‌ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంద‌న్న‌దే ఆస‌క్తిక‌రం.

 

Share this post

submit to reddit
scroll to top