ర‌వ్వంత‌నుకున్నారా… రేవంత‌!

revanth-reviews.jpg

అధికార‌దండం చేతికొచ్చేసింద‌ని ఎక్కడా తొందరపడటంలేదు. గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోవ‌డం లేదు. ప్రతి అంశంపైనా, ప్రతి ప్రాజెక్ట్‌పైనా లోతుగా వివ‌రాలు తెలుసుకుంటున్నారు. లోటుపాట్లు స‌మీక్షిస్తున్నారు. ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌ అంతా బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్టులపైనే. వచ్చీరాగానే విద్యుత్‌రంగంపై దృష్టిపెట్టారు తెలంగాణ కొత్త సీఎం. 24 గంటల కరెంట్‌ నిజమా కాదా అని లెక్కలడిగారు. రైతులకు ఎన్ని గంటల కరెంట్‌ ఇస్తున్నామో లెక్కతీయమన్నారు. విద్యుత్‌ రంగంలో 85వేల కోట్ల రూపాయల అప్పులెందుకు చేయాల్సి వచ్చిందో ఆరా తీశారు.

మెట్రోపై సమీక్షిస్తూ రాయదుర్గం- శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ రూట్లో ఇప్పట్లో మెట్రో అక్కర్లేద‌ని తేల్చేశారు. కేసీఆర్‌, కేటీఆర్ త‌మ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న శంషాబాద్‌ మెట్రో రూట్‌ని రేవంత్‌రెడ్డి చాలా వేగంగా స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మెట్రో ప్రాజెక్ట్‌ను పాతబస్తీవైపు తిప్పారు. ఓఆర్ఆర్‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న రాయ‌దుర్గం కంటే.. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, మూసీ వెంట రోడ్‌ కమ్ మెట్రో కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాలన్న ఆదేశాల‌తో మెట్రో ఎక్స్‌టెన్ష‌న్‌పై రేవంత్‌రెడ్డి తన మార్క్‌ వేయబోతున్నారు.

ముచ్చర్ల ఫార్మాసిటీని చూపించి బీఆర్ఎస్ హ‌యాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగా జ‌రిగింది. ప్రపంచంలోనే కాలుష్యం లేని అతిపెద్ద ఫార్మా సిటీగా అప్ప‌టి ప్ర‌భుత్వం దీన్ని ప్రొజెక్ట్ చేసింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌పై మరో అభిప్రాయంతో ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా ఫార్మాసిటీతో కాలుష్యం తప్పదనేది ప్రభుత్వ ఉద్దేశం. పైగా రీజనల్‌ రింగ్‌రోడ్‌ వస్తే ఆ ప్రాంతం మరో హైదరాబాద్‌ని సృష్టిస్తుంది.అందుకే ఫార్మాసిటీని జ‌న‌వాసాల‌కు మరికాస్త దూరంగా జరపాలని ఆదేశించారు. అదే స‌మ‌యంలో రియ‌ల్ ఎస్టేట్ డీలాప‌డ‌కుండా ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో మ‌రో మహానగరాన్ని నిర్మించాల‌న్న‌ ప్రణాళికతో ఉన్నారు. శ్రీశైలంరోడ్‌ను కలుపుతూ తుక్కుగూడ మీదుగా మెట్రో ఉండాలన్న ప్ర‌తిపాద‌న‌తో హైదరాబాద్ అభివృద్ధిపై త‌న‌దైన ముద్ర‌వేయ‌బోతున్నారు రేవంత్‌రెడ్డి.

ఎన్నిక‌ల‌ప్ర‌చారంలో ధ‌ర‌ణి అక్ర‌మాల‌పై గ‌ట్టిగా గొంతెత్తారు రేవంత్‌రెడ్డి. సీఎం కాగానే ధరణి లోటుపాట్ల‌పై దృష్టిపెట్టారు. ధరణి వచ్చాక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన ప్రభుత్వ ఆస్తుల చిట్టా తీయబోతున్నారు. ధరణిని తీసేయాలంటే ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ ఉండాలి. భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తామని చెప్పినా ఇప్పటికిప్పుడు మార్పు సాధ్యం కాకపోవచ్చు. అలాగని ధరణిని అలాగే కొన‌సాగించే అవకాశం కూడా లేదు. అందుకే ముందుగా ధరణిలో త‌లెత్తుతున్న సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. వీలైనంత త్వరగా భూసమస్యలు పరిష్కరించాల‌న్న‌ది తెలంగాణ కొత్త సీఎం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ ప్ర‌చారంలో బ్ర‌హ్మాస్త్ర‌మైన కాళేశ్వ‌రంపైనా ప్ర‌భుత్వం పోస్ట్‌మార్టం మొద‌లుపెట్టింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగింది. అన్నారం బ్యారేజ్‌పైనా భయాలున్నాయి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్‌ డిజైన్‌ నుంచి నిర్మాణం వరకు ప్రతీ అంశాన్ని పరిశీలించబోతున్నట్టు ప్రకటించారు. సీడబ్ల్యూసీ అనుమతులు, నిధుల సమీకరణ, ప్రాజెక్ట్ డిజైన్లు, నిర్మించిన ఏజెన్సీ వివరాలు అందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ దాన్ని అంత తేలిగ్గా వదిలే అవకాశం లేదు. ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే దాన్ని ప్రజల ముందు ఉంచుతూనే.. ప్రాజెక్ట్‌ పనికొస్తుందో రాదో తేల్చ‌బోతోంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

బీఆర్ఎస్ పాల‌న‌లో సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌పైనా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు రేవంత్‌రెడ్డి. ప్రజా భవన్‌గా మార్చి ప్ర‌జ‌ల విన్న‌పాల‌కు వేదిక చేసింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పముందుగా పేరు మార్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చింది. దళిత సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లోకి పంపించడం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ స‌ర్కారు స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. మ‌రోవైపు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌కు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. పేప‌ర్ లీకేజీ కేసుపైనా కొత్త సీఎం ఆరాతీశారు. ఇలా గత ప్రభుత్వంలో అమలైన ప్రతీ ప్రాజెక్ట్‌పై స‌మీక్ష‌ల‌తో పాల‌న‌ను త‌న ప‌ట్టులోకి తెచ్చుకుంటున్నారు తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రి.

Share this post

submit to reddit
scroll to top