అభియోగాలతో అరెస్ట్ అయిన నిందితుడు తాను నిర్దోషినని రుజువు చేసుకోవాలి. ఆ అభియోగాలకు ఆధారాలు లేవని తేలితే కడిగిన ముత్యంలా బయటికిరావాలి. సుదీర్ఘకాలం సీఎంగా, ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడుకి ఆ విషయం ఒకరు చెప్పాల్సినపన్లేదు. కానీ అధికారంలో ఉండగా చేసిన ఎన్నెన్నో సంతకాల్లో ఓ ఫైలు ఇలా పీకలకి చుట్టుకుంటుందని ఆయన ఊహించలేదు. కేంద్రంలో చక్రం తిప్పగల తనలాంటి నాయకుడు నిస్సహాయంగా జైలుగోడలమధ్య మగ్గాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే నాయకుడు మానసిక క్షోభకు గురవుతున్నారు.
అరెస్టు అక్రమం. చెయ్యని తప్పు చేశానని చెబుతున్నారు. ఇదీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు ఆవేదన. సీఐడీ వాదనతో ఏకీభవించి రిమాండ్‌కి పంపించాక నేనేమి చేశాను నేరం అంటే ఎలా కుదురుతుంది? చంటిపిల్లాడిలా బాధపడ్డ చంద్రబాబుని జడ్జిగారు కూడా ఓదార్చారు. చట్టం ఎవరికైనా సమానమేనని, దర్యాప్తులో అన్నీ తేలతాయన్నారు. రిమాండ్‌ని శిక్షగా భావించవద్దంటూనే సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ని పొడిగించింది. వింతైన విషయమేంటంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆయన్ని జైల్లోనే అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని స్వయానా ఆయన కొడుకు లోకేష్ ఆరోపించారు. మరి చంద్రబాబు తన భద్రత గురించి ఎందుకు ఆందోళన వ్యక్తం చేయడంలేదు?
రాజమండ్రి సెంట్రల్ జైల్లో డెంగీతో ఓ ఖైదీ చనిపోయినా ఏదో కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు గదిలో ఏసీ కూడా లేదని, ఆయన రూంలో ఫ్యాన్ తిరగడం లేదని, వేడినీళ్లు ఇవ్వడంలేదని ఏవేవో ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు ధైర్యం చెప్పారు. రిమాండ్‌లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ప్రశ్నించారు. నిజంగా ఆయన తనయుడు, టీడీపీ నేతలు చెబుతున్న సమస్యలుంటే చంద్రబాబే నేరుగా ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ ఆయన అలాంటి విషయాలేమీ ఎత్తలేదు. నిజంగానే జైల్లో దారుణపరిస్థితులుంటే, ఎవరినుంచైనా ముప్పు ఉందన్న అనుమానముంటే ఆయన ఒక్క మాట చెబితే సరిపోదా. ఏమీ చెప్పలేదంటే అలాంటివేమీ లేవనేగా. లోకేష్‌కి ఎవరన్నా చెప్పొచ్చుగా!