ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. నిస్సహాయంగా రాజమండ్రి సెంట్రల్ జైలు గోడలమధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ములాఖత్‌కోసం వచ్చేవారితో కాసేపు మాట్లాడుతున్నారు. తిరిగేకాలు తిట్టే నోరు ఆగవన్నట్లు ఎప్పుడూ జనంమధ్య తిరిగే నాయకుడికి జైలుగోడల మధ్య జీవితం నరకంలాగే ఉంది. అందుకే ఎప్పుడు బయటపడదామా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రాకి హరీష్ సాల్వే తోడయ్యారు. క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు తమ వాదన వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకి బెయిల్ వస్తుందో లేదోనన్న చర్చ జరుగుతుండగానే మరిన్ని కేసులతో బయటికిరాకుండా చూసే ప్రయత్నాల్లో పోలీసులున్నారు.
అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు ఘటనలో పోలీసులు కేసు నమోదుచేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ఉంది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ న్యాయవాదులు సమయం కోరడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సెప్టెంబరు 21కి వాయిదా పడింది. ఇవన్నీ నడుస్తుండగానే చంద్రబాబుపై సీఐడీ మరో కేసు బనాయించింది. ఫైబర్ నెట్ స్కాంపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు వేసిన పీటీ వారెంట్‌ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా సీఐడి పేర్కొంది.

టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ ఆరోపిస్తోంది. 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పటి ఎఫ్ఐఆర్‌లో సీఐడీ ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావును చేర్చింది. ఒక కేసులో బయటపడినా మరో కేసులో ఆయన రిమాండ్ కొనసాగించేలా ఎన్నికలముందు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. నిప్పులేందే పొగరాదు. ఆధారాలు లేనిదే ఏ కేసూ నిలబడదు. అడుసుతొక్కనేలా కాలు కడనగేల అన్న సామెతకు అర్ధమేంటో చంద్రబాబులాంటి తలపండిన నాయకుడికి చెప్పాల్సిన పన్లేదేమో!