ఉమ్మ‌డి రాజ‌ధాని.. దింపుడు క‌ళ్లెం ఆశ‌!

ycp-comon-capital.jpg

దింపుడు క‌ళ్లెం ఆశ‌ని ఒక‌టిఉంటుంది. పోయిన ప్రాణం తిరిగిరాద‌ని తెలిసినా అది చివ‌రిప్ర‌య‌త్నం. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయింది. ప‌దేళ్లు ఉమ్మ‌డిరాజ‌ధానిగా ప్ర‌క‌టించినా ఐదేళ్ల‌ముందే చంద్ర‌బాబు ఆ ఆప్ష‌న్ వ‌దిలేసుకున్నారు. ఆ నిర్ణ‌యం త‌ప్ప‌యినా ఒప్ప‌యినా కాల‌చ‌క్రం గిర్రున తిరిగి ప‌దేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో రెండేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంచినా, ఉంచాల‌ని అడిగినా న‌యాపైసా ఉప‌యోగం ఉండ‌దు. అయినా హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల‌న్న మాట వైసీపీ నోట రావ‌డ‌మే ఆశ్చ‌ర్య‌. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్. అంటే కొత్త సెక్ర‌టేరియ‌ట్‌లో మ‌ళ్లీ కాస్త చోటివ్వ‌మ‌ని అడుగుదామా? ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీలోనే మ‌ళ్లీ మీటింగులు పెట్టుకుందామా? ప‌దేళ్ల‌లో సొంత రాజ‌ధానిని నిర్మించుకోలేని అశ‌క్త‌త‌ని మ‌న‌మే బ‌య‌ట‌పెట్టుకుందామా?

సాధ్యాసాధ్యాల గురించి వైసీపీ ఎంత‌వ‌ర‌కు ఆలోచించిందో గానీ ఈ ప్ర‌తిపాద‌న‌పై దాదాపుగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతే వ‌చ్చింది. అమ‌రావ‌తి పేరుతో త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఓ క‌ల్పిత ప్ర‌పంచాన్నిసృష్టించారు నారా చంద్ర‌బాబునాయుడు. అదేంటీ అంత‌మంది రైతుల‌త్యాగం, అక్క‌డ క‌నిపిస్తున్న మౌళిక స‌దుపాయాలు వాస్త‌వంకాదా అని అడిగితే అది ఆత్మ‌వంచ‌నే అవుతుంది. మూడు పంట‌లు పండే ప‌చ్చ‌టి పొలాల‌ను రాజ‌ధానికోసం తీసుకోవ‌డ‌మే త‌ప్పు. లోటుబ‌డ్జెట్‌తో తొలి అడుగు వేసిన విభ‌జిత రాష్ట్రంలో వేల‌కోట్లు ఖ‌ర్చ‌య్యే ఓ ఊహాజ‌నిత రాజ‌ధానిని సృష్టించాల‌నుకోవ‌డం రెండో త‌ప్పు. మింగ మెతుకులేదు మీసాల‌కు సంపెంగ‌నూనె అన్న‌ట్లు త‌న‌కు తోచిందేదో చేసుకుపోయారు చంద్ర‌బాబు. ఫ‌లితంగా ఆయ‌న ఐదేళ్ల‌పాల‌న‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని తాత్కాలిక వ‌స‌తుల‌కే ప‌రిమిత‌మైంది.

స‌రే మంచోచెడో మొద‌లుపెట్టేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌యినా దాన్ని కొన‌సాగించి ఉండాల్సింది క‌దా అంటే ప్ర‌తీప్ర‌భుత్వానికి త‌న‌కంటూ ఓ రాజ‌కీయ ఎజెండా ఉంటుంది. పాత ప్ర‌భుత్వ వాస‌న త‌గ‌ల‌కుండా చూసుకోవాల‌నుకుంటుంది. వైసీపీ కూడా అదే చేసింది. అయితే అమ‌రావ‌తి బ‌దులు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ని తెర‌పైకి తెచ్చిన వైసీపీ ఈ ఐదేళ్ల‌లో దాన్నో య‌జ్ఞంలా తీసుకుని పూర్తిచేసుకుని ఉండాల్సింది. సాంకేతిక కార‌ణాలు, న్యాయ‌ప‌ర‌మైన అవ‌రోధాల‌తో మూడు రాజ‌ధానుల దిశ‌గా అడుగులు వేగంగా ప‌డ‌లేదు. ఈలోపు పుణ్య‌కాలం గ‌డిచిపోయి మ‌ళ్లీ ఎన్నిక‌లొస్తున్నాయి. రాజ‌ధాని లేని ఏకైక‌రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. అమ‌రావ‌తిని కొన‌సాగించ‌లేక‌, తాము అనుకున్న‌ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేయ‌లేకే వైసీపీ ఉమ్మ‌డి రాజ‌ధాని ప్ర‌తిపాద‌న తెచ్చింద‌న్న విమ‌ర్శ స‌హ‌జంగానే వ‌స్తుంది.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని జనం ఎప్పుడో మరిచిపోయారు. ఏపీలో ఒకవర్గం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటున్నారు. మరోవర్గం మూడు రాజధానుల‌కు మ‌ద్ద‌తిస్తోంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే సరిపోతుంద‌నే స‌మూహం కూడా ఉంది. అంతే తప్ప హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా మరింత కాలం కొనసాగించాలని ఎవరూ డిమాండ్‌ చేయట్లేదు. ప‌దేళ్ల త‌ర్వాత కూడా దేహీ అనే ప‌రిస్థితి ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు ఓ సెంటిమెంట్‌ ఉంది. కష్టపడి కట్టుకున్న హైదరాబాద్‌ను వదులుకోడానికి ఇష్టపడకపోయే సరికి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిని చేశారు. అందులోనూ సీమాంధ్రుల భద్రత కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నా, లేకపోయినా పెద్ద‌గా తేడా ఏమీ ఉండ‌దు. అలాంటప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని కొనసాగించాలనే ఆలోచనే త‌ప్ప‌న్న‌ది కొంద‌రి వాద‌న‌.

వైవీ సుబ్బారెడ్డి అనాలోచింతంగా ఆ మాట అన్నార‌ని భావించ‌లేం. చంద్ర‌బాబు త‌ప్పిదాల వ‌ల్లే హైద‌రాబాద్‌పై ఆంధ‌ప్ర‌దేశ్‌కి ఉన్న హ‌క్కుని వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌న్న చ‌ర్చ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నుకుంది. పైగా విభజన హామీల్లోని షెడ్యూల్ 9, 10లో పొందుపర్చిన సంస్థలకు సంబంధించి సుమారు లక్షా 42 వేల కోట్ల ఆస్తులు, రెవెన్యూ, ఇతర పంపకాలు ఇప్ప‌టికీ జరగలేదని చెబుతున్నారు. ఈ కార‌ణంతో పంపకాలు ముగిసే వరకైనా హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా హైదరాబాద్‌ సెంటిమెంట్‌ను ఎన్నికల అస్త్రంగా మలచబోతున్నార‌నే చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ కామన్‌ క్యాపిటల్‌ ఎక్స్‌టెన్షన్‌ను ఎన్నికల అంశంగా చేర్చితే.. అది వైసీపీకి పాజిటివ్‌ అవుతుందా అనేది సమాధానం లేని ప్రశ్నే.

Share this post

submit to reddit
scroll to top