మరణశిక్ష వేసేంత నేరం చేశారా!?

qatar-death-sentence.png

ఇండియన్‌ నేవీ మాజీ అధికారులు ఎనిమిదిమందికి ఖతార్‌ న్యాయస్థానం మరణశిక్ష విధించడం సంచలనం రేపింది. 14నెలలుగా వారు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. ఉపాధి కోసం వెళ్లి ఉరి కంబం ఎక్కే పరిస్థితి రావటంతో వారిని ఈ గండంనుంచి బయటపడేసేందుకు భారత్‌ దౌత్యమార్గాలు వెతుకుతోంది. ఖతార్‌ మరణశిక్ష విధించిన 8మందిలో విశాఖకు చెందిన సుగుణాకర్‌రావు కూడా ఉన్నారు. సంపన్న అరబ్‌ పెట్రో దేశంగా ఖతార్‌కి గుర్తింపు ఉంది. మరణశిక్ష పడ్డ ఎనిమిదిమంది ఖతార్‌ సైనిక దళాలకు సేవలందించే ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌ తరపున గూఢచర్యానికి పాల్పడ్డారనేది వారిపై ఉన్న ప్రధాన అభియోగం.
ఖతార్‌ సైనిక దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే అల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో వీరంతా పనిచేస్తున్నారు. ఒమాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి 2015లో ఈ కంపెనీని స్థాపించారు. 8 మంది అరెస్టు తర్వాత ఆ సంస్థని మూసివేశారు. ఖతార్‌ జలాంతర్గాముల కార్యక్రమానికి సంబంధించిన రహస్యాలను ఇజ్రాయెల్‌కి చేరవేస్తూ యూదు దేశం తరఫున గూఢచర్యానికి పాల్పడ్డారని నేవీ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం పోయినేడాది ఆగస్టులో అరెస్ట్‌ చేసింది. తీర్పు వచ్చేదాకా వారిపై ఉన్న అభియోగాలను అక్కడి ప్రభుత్వం వెల్లడించకపోవటంతో ఎందుకు వారు జైల్లో మగ్గుతున్నారో కూడా తెలియలేదు. కస్టడీలో ఉన్న భారతీయులను కలుసుకోవడానికి ఖతార్‌లోని భారత రాయబారిని ఈమధ్యే అనుమతించారు.

రాడార్ల కంటికి చిక్కని ఇటాలియన్‌ సబ్‌మెరైన్ల విషయంలో రక్షణ దళాలకు అల్‌ దహ్రా సంస్థ సలహాలు, సేవలందిస్తోంది. ఆ కంపెనీలో మొత్తం 75 మంది భారతీయ ఉద్యోగులు పనిచేసేవారు. ఈ ఏడాది మే నెలలో మూసివేసిన ఈ సంస్థ సిబ్బందిలో ఎక్కువ మంది భారత నేవీ మాజీ ఉద్యోగులే. 45–64 ఏళ్ల మధ్య వయసున్న భారత నేవీ మాజీ సిబ్బందిలో 8 మందిపైనే గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. తమ జలాంతర్గాముల దిగుమతి గురించి ఈ 8 మంది ఇజ్రాయెల్‌కు రహస్యాలు చేరవేశారని ఖతార్‌ ఆరోపిస్తోంది.

మరణశిక్షపడ్డవారిలో తెలుగువాడైన సుగుణాకర్‌ 18 ఏళ్లకే ఇండియన్‌ నేవీలో చేరి పాతికేళ్ల సర్వీసు తర్వాత 2013లో రిటైరయ్యారు. ముంబై, అండమాన్‌ నికోబార్‌ దీవులు, విశాఖపట్నంలో పనిచేసిన సుగుణాకర్‌కి సర్వీసులో ఉండగా అనేక పురస్కారాలు లభించాయి. ఆయనతో పాటు మరణశిక్ష పడ్డ కమాండర్‌ పూర్ణేందు తివారీ కూడా భారత నేవీలో ఎన్నో పురస్కారాలు అందుకున్న సైనికుడే. దీర్ఘకాలం భారత సైనికదళాల్లో పనిచేసిన 8 మంది ఇండియన్‌ నేవీ మాజీ అధికారులకు భారతీయులు ఎక్కువమంది పనిచేసే ఖతార్‌లో గూఢచర్యం అభియోగంతో మరణశిక్షపడటం అసాధారణ విషయం. హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌కి మద్దతు ప్రకటించిన భారత్‌కి ఖతార్‌లో మనవాళ్లు ఉరికంబం ఎక్కకుండా కాపాడుకోవడం పెద్ద సవాలే!

Share this post

submit to reddit
scroll to top