పిడికిలెత్తి బయటికి.. జైలుకెళ్లింది దేనికి?

kavitha-bail.jpg

చూట్టానికే అసహ్యంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడి జైలుకెళ్లినట్లు, ప్రజలకోసం త్యాగంచేసి కటకటాలపాలైనట్టు ఆ పిడికిలి బిగించుడేందో.. ఆ నినాదాలేందో! కల్వకుంట్ల కవిత జైలుగోడల మధ్యనుంచి బయటికొచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ శ్రేణుల హంగామా అంతా ఇంతా కాదు. అధినేత కూతురు ఐదునెలల తర్వాత జైల్లోంచి బయటికొస్తే ఆమె ప్రపంచాన్ని జయించినట్లు, దాస్యశృంఖలాలు తెంచుకుని జైలుగోడలు బద్దలుకొట్టి బయటికొచ్చినట్లు అంత బిల్డప్‌ అవసరమా? మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందసలు జైలుకు? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు పనులుచేసినా నడుస్తుందన్న అహం ఆమెను ఊచల్లెక్కపెట్టేలా చేసింది. తెలంగాణ సమాజం పరువు తీసేలా ఓ మహిళ, అందునా బీఆర్‌ఎస్‌ అధినేత కూతురు లిక్కర్‌స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ సూత్రధారిగా చిప్పకూడు తినాల్సి వచ్చింది.

నేనిస్తా తమ్ముడా నేనిస్తా తమ్ముడా అంటూ ఓ సిన్మాలో హీరో ఆవేశంగా పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఈ అక్క అలాంటి ఉద్యమస్ఫూర్తినేం రగిలించలేదు. పేదలకోసం పోరాడలేదు. అడ్డగోలు సంపాదనతో ఆస్తులు మరింత పెంచుకునే తాపత్రయంలో అడ్డంగా దొరికిపోయింది. జైలుకెళ్లినప్పుడు, కోర్టుకు హాజరుపరిచినప్పుడు కూడా విప్లవోద్యమ నేపథ్యమేదో ఉన్నట్లు తను పిడికిలి బిగించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. తండ్రి, అన్నని మించిపోయే టాలెంట్‌ కల్వకుంట్ల కవితకు ఉందని తెలంగాణ సమాజానికి ఎప్పుడో అర్ధమైపోయింది.

జైలునుంచి కవిత బయటపడటం సహజంగా జరిగే న్యాయప్రక్రియ. మొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇదే కేసులో బెయిల్‌పై వచ్చాడు. ఇప్పుడు కవితకు బెయిలొచ్చింది. అంతమాత్రాన ఆమెపై పెట్టింది అక్రమ కేసైపోదు. ఇన్ని అభియోగాలున్న కవిత బెయిల్‌ రాగానే పునీతురాలైపోదు. సుప్రీంకోర్టులో బెయిల్‌పై వాదోపవాదాల సమయంలోనూ లిక్కర్‌ స్కామ్‌లో కవితదే కీలకపాత్రని ఈడీ కుండబద్దలు కొట్టింది. అంటే ఈడీ చెప్పిందే వేదమా అంటే.. నిప్పులేందే పొగరాదన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జైలునుంచి బయటికొచ్చిన కవితను కామ్‌గా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లుండే బీఆర్‌ఎస్‌కి కాస్త పరువన్నా దక్కేది. ఈ ఊరేగింపులు, పిడికిలి బిగింపులతో మరింత బద్నాం అవుతున్నామన్న సోయిలేకుండా పోయింది కేసీఆర్‌ పార్టీకి.

కవితకు బెయిలొచ్చింది. రేపు నేరం నిరూపణైతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఆమెను దోషిగా చెప్పలేంకానీ అభియోగాలు ఎదుర్కుంటున్న నిందితురాలిగా చూడకుండా ఉండలేం. కొన్నాళ్లుగా కేటీఆర్‌, హరీష్‌రావు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటంకోసమన్నది పైకి చెబుతున్న మాట. కానీ కవితను బయటికి తెచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం ముందు బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం సాగిలపడిందనేది బయటజరుగుతున్న చర్చ. అబ్బే అదేంలేదని బీఆర్‌ఎస్‌ చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే కేజ్రీవాల్‌ ఇంకా జైల్లోనే ఉన్నారు. తెలంగాణ పరువుని లిక్కర్‌లో ముంచిన కవితమ్మ మాత్రం విజయగర్వంతో బయటికొచ్చింది.

చూశారా చూశారా నేను చెప్పిందే జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి వేలెత్తిచూపే ఛాన్స్ దొరికింది. లోకసభ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందంపై రేవంత్‌ ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయి 8సీట్లలో బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఇప్పుడు కవితకు బెయిల్‌తో ఆ రెండుపార్టీల మధ్య బంధంపై రేవంత్‌ ఆరోపణలు పదునెక్కబోతున్నాయి. కవితను జైలుకు పంపి తమమీదపడ్డ బురదను తుడిచేసుకున్నామనుకుంటున్న తెలంగాణ బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. బీఆర్‌ఎస్‌ వస్తానన్నా రానివ్వమని ప్రగల్భాలు పలికిన బండి, కిషన్‌రెడ్డిలాంటి నేతలు.. అగ్రనాయకత్వం ఆడే గేమ్‌ని కళ్లప్పగించి చూడాల్సిందే.

Share this post

submit to reddit
scroll to top