టాలీవుడ్‌కేం.. ఓ వెలుగు వెలిగిపోతోంది. నాటునాటుకొట్టుడుతో ఆస్కార్ కొట్టేశాం. ఎర్రచందనం స్మగ్లింగ్ సిన్మాతో జాతీయ ఉత్తమనటుడి అవార్డు సొంతం చేసుకున్నాం. అన్ని ఉడ్‌లూ మనవైపు హాశ్చర్యంగా చూస్తున్నాయ్. ఒకప్పుడు క్రియేటివిటీనే లేదనుకున్న మన సిన్మా ఈమధ్య రొమ్ము విరుచుకుంది. అంతా బాగానే ఉంది కానీ ఏదో లోటు అలాగే మిగిలిపోతోంది. హీరోల ఇమేజ్‌ని నమ్ముకుని కోట్లకు కోట్లు కుమ్మరిస్తే కొన్ని సిన్మాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతుంటాయ్. నిర్మాతలు నెత్తిన తువ్వాలేసుకున్నా అయ్యో పాపం అనేవారుండరు. హీరోలు, హీరోయిన్లు, నాలుగైదు సిన్మాలకే పరువాలను చూసుకుని మిడిసిపడే కొందరు సహనటులు అంతా పుడింగిలే. అయినా వారి దయ మా ప్రాప్తం అన్నట్లు ఇండస్ట్రీ సర్దుకుపోతుంటుంది.
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అరవ సిన్మాలు కొన్ని అతిగా అనిపించినా కోలీవుడ్‌లో కొన్ని రూల్సూ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్‌గానే ఉంటాయి. సిన్మాలకు పెట్టుబడి పెట్టే అక్కడి నిర్మాతలకు గట్స్ ఉంటాయి. మరి మన నిర్మాతలో అన్న ప్రశ్న వస్తే కరెన్సీ కట్టలు చేతిలో పెట్టటం తప్ప గట్టిగా నోరెత్తలేరన్నది జగద్విదితం. కోలీవుడ్ గట్స్ విషయానికొస్తే నలుగురు హీరోలకు తమిళ చిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డులు జారీచేసింది. ధనుష్, విశాల్, శింబుతో పాటు అధర్వలపై అక్కడి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కన్నెర్ర చేసింది. రెడ్‌కార్డు అంటే.. ఇక తమిళ సిన్మాల్లో వాళ్లకి ఎంట్రీ లేదని ఆంక్షలు పెట్టడమే! ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మళ్లీ నిర్ణయం తీసుకునేదాకా ఆ నలుగురితో ఎవరూ సిన్మాలు తీయడానికి లేదు. టాలీవుడ్‌లో ఇలాంటి యాక్షన్‌ని మనం కల్లో కూడా ఊహించలేం.
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ కోలీవుడ్‌లో స్టార్ హీరో. బిజీ హీరోగా పేరున్న ధనుష్ ఈమధ్యే స్వీయ దర్శకత్వంలో తన 50వ సిన్మా ఎనౌన్స్ చేశాడు. 80శాతం పూర్తయిన ఓ సిన్మా ధనుష్ నిర్లక్ష్యంతో పట్టాలెక్కడంలేదు. దీంతో ఆ సిన్మా నిర్మాణ సంస్థకు నష్టాలొచ్చాయి. తప్పులు అలవాటైపోయిన శింబు రెండోసారి రెడ్‌కార్డుతో బుక్ అయ్యాడు. ఆరేళ్లక్రితం రిలీజై అట్టర్ ఫ్లాప్ అయిన ‘ఆలంభవన్ అడంగాథవన్ అసరాధవన్’ సినిమా నిర్మాత ఫిర్యాదుతో శింబుకి ఈ నోటీసు అందింది. 60 రోజుల కాల్షీట్లు ఇచ్చి 27 రోజులు మాత్రమే పనిచేశాడు శింబు. దాంతో ఆ సిన్మాని అనుకున్న విధంగా తీయలేకపోయానన్నది ప్రొడ్యూసర్ కంప్లయింట్.
తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్‌కి కూడా రెడ్‌కార్డు అందడం అసలైన ట్విస్ట్. పైగా ఇప్పుడాయన నటీనటుల సంఘం కార్యదర్శి. గతంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశారని, లెక్కలు చెప్పడం లేదంటూ రెడ్ కార్డు జారీ చేశారు. ఇక తెలుగులో గద్దలకొండ గణేష్ సిన్మాతో పరిచయం అయిన మరో కోలీవుడ్ హీరో అధర్వకి కూడా రెడ్‌కార్డు ఇచ్చింది నిర్మాతల మండలి. అధర్వ నటించిన ‘సెమ్మ నాడు ఆగడే’ ఫ్లాప్ అయింది. దీంతో ఆ సిన్మా ప్రొడ్యూసర్‌కి మరో సిన్మా చేస్తానన్న అధర్వ మాట నిలబెట్టుకోలేదు. దీంతో ప్రొడ్యూసర్ ఫిర్యాదుతో ఆ యువహీరోకి కూడా రెడ్ కార్డు అందింది. కోట్లకు కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నప్పుడు ప్రొడ్యూసర్లకు సహకరించాలి. కానీ ఏ ఉడ్‌లోనైనా రెండు పడవలమీద కాళ్లు పెట్టేవాళ్లు ఎక్కువైపోయారు.
నిర్మాత తన చావు తాను చస్తాడు. మన రెమ్యునరేషన్ అందిందా లేదా అన్నది తప్ప కొందరు హీరోలు హీరోయిన్లకు మిగతావాటితో పన్లేదు. కొందరైతే ప్రమోషన్లకు కూడా రారు. తమను నమ్ముకుని ప్రొడ్యూసర్ మునిగినా పట్టించుకోరు. ఆస్కార్ అవార్డు వచ్చినా, జాతీయస్థాయి గుర్తింపు లభించినా కోలీవుడ్‌నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక ప్రొడ్యూసర్ దివాలాతీస్తే మరో బకరా దొరుకుతాడని హీరోహీరోయిన్లు అనుకున్నంత కాలం, వాళ్లు తమ సిన్మా చేయడమే గొప్పని నిర్మాతలు సర్దుకుపోతున్నంత కాలం రెడ్‌కార్డులు ఇచ్చే దమ్ము మనకు ఎప్పటికీ రాదు.